Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు రిసెప్షనిస్టుల అవార్డు సభలో డీజీపీ అంజనీకుమార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసుల పని తీరు ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. తెలంగాణ పోలీసు అకాడమిలోని రాణి రుద్రమదేవి హాల్లో బుధవారం జరిగిన పోలీసు రిసెప్షనిస్టులకు అవార్డుల ప్రదానం కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 721 పోలీసు స్టేషన్లకు సంబంధించి 75 మంది పోలీసు రిసెప్షన్ అధికారులకు వారి చక్కటి ప్రతిభను ప్రోత్సహిస్తూ అవార్డులు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రతి పోలీసు స్టేషన్ పని తీరు మెరుగు పరిచి, ప్రజలకు చక్కటి సేవలను అందించడానికి ఉద్దేశించిన 17 వర్టికల్స్‌ను ఆదర్శవంతంగా అమలు చేస్తున్నందుకు గాను వీరికి ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ వర్టికల్స్‌ను ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు అధ్యయనం చేసి వాటిని తమ పోలీసు స్టేషన్లలో అమలు చేయడానికి పూనుకోవడం తమ పని విధానానికి నిరద్శనంగా ఆయన చెప్పారు. తమ ఏరియా పోలీసు స్టేషన్లలో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మంచి విధానాలను అమలు చేసే 20 మంది ఏసీపీలు, ఎస్పీలు, డీసీపీలకూ మంచి అవార్డులనిచ్చి ప్రోత్సహించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనాతో మరణించిన పోలీసు అధికారులు, సిబ్బందికి చెందిన 68 మంది పిల్లలకు చదువులలో ప్రోత్సహించడానికి గాను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నగదు స్కాలర్షిప్లను ఇవ్వడం సంతోషకరమన్నారు. పోలీసు స్టేషన్ల రిసెప్షనిస్టులకు అవార్డులను ప్రదానం చేసిన డీజీపీ.. 68 మంది పోలీసు పిల్లలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్కాలర్‌షిప్‌లనూ అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, రాష్ట్ర పోలీసు స్పోర్స్ట్ విభాగం అదనపు డీజీ అబిలాష బిస్త్, పోలీసు అకాడమి డైరెక్టర్ సందీప్ శాండిల్య, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రీజినల్ అధికారితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.