Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్కు కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని 35 వేల ఓటర్ల తొలగింపు అక్రమమని పురపాలకశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఈ చర్య ప్రజల రాజ్యాంగ హక్కులను హరించడమేనంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఐదు సంవత్సరాలలో ఓటర్ల సంఖ్య తగ్గిందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో తొలగించిన వారిని తిరిగి చేర్చాలని కోరుతూ కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు బుధవారం లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓట్ల జాబితా నుంచి తొలగించారని వివరించారు.
భారత స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. తొలగించిన ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా, వారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దూరం చేయడం ఆక్రమం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు, విద్యుత్ శాఖకు, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులను చెల్లిస్తున్నారన్నారని తెలిపారు. వీరు గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వీరి హక్కులను హరించేలా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని విమర్శించారు. అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సహేతుకంగా లేదని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు ఆక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదని స్పష్టం చేశారు. తొలగించిన ఓటర్లను అక్రమంగా నివాసం ఉంటున్నారని రుజువు చేయకుండానే, నేరుగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయమన్నారు. 2018లో 1,91,849 ఓటర్లు ఉంటే ఈరోజు వారి సంఖ్య 1,32,722 కు తగ్గడం దురదష్టకరమన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చేస్తున్న ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గత ఐదు సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలోని పౌరుల సంఖ్య పెరగకుండా తగ్గిందని గుర్తుచేశారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35 వేలమంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.