Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే కేసీఆర్ దోస్తానా
- కారు మీద కోపంతో బీజేపీకి ఓటువేయొద్దు
- ధర్మపురి కాదు అధర్మపురి
- నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ గడ్డపై ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని ప్రజలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మన బతుకులు మరింత ఆగమైతాయని స్పష్టంచేశారు. ఎంఐఎం అధ్యక్షుని మాట విని ముస్లింలు కారుకు ఓటు వేస్తే ఆ ఓట్లతో గెలిచిన కేసీఆర్ గల్లీలో ఎంఐఎంతో ఢిల్లీలో బీజేపీతో దోస్తానా చేస్తున్నారని విమర్శించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి అటకెక్కించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేవంత్‌రెడ్డి యాత్ర బుధవారం దుబ్బ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. రాత్రి నెహ్రూ పార్క్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తారని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ చేతల్లో అధర్మపురిగా మారారని ఆరోపించారు. మోడీ తన జేబులో ఉంటాడని చెప్పిన ధర్మపురి.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అరవింద్ వ్యవహారం 'నాకుంది గుండు.. నేను రాసిచ్చా బాండ్' అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధించామని ప్రచారం చేసుకుంటూ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని, కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. కాబట్టి ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని అన్నారు. అమరవీరుల స్థూపం, సచివాలయం నిర్మాణం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అన్నింట్లో అవినీతి జరిగిందని, విచారణకు ఆదేశిస్తే ఆధారాలతో నిరూపిస్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరితే ఇప్పటివరకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్ అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీని ఇచ్చారు. బారుబారు కేసీఆర్ అంటూ ప్రసంగం ముగించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రేవంత్‌రెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు కేశ వేణు, తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.