Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
- మిన్నంటిన బాధితుల ఆర్తనాదాలు
- సెల్ఫోన్ల లైట్లతో సంకేతాలు
- బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది
నవతెలంగాణ-బేగంపేట
రూబీ హౌటల్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం సంచలనం రేపింది. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొంత మంది ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 7.30గంటల సమయంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్ 5,6,7,8వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో వ్యాపారులు, సిబ్బంది, కోనుగోలుదారులు, ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ అలుముకోవడంతో.. అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారు హాహాకారాలు చేశారు. కొంతమంది మెట్ల మార్గంలో భవనంపైకి చేరుకుని రక్షించండంటూ కేకలు వేసారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 13 మందిని భారీ క్రేన్ల సహాయంతో కిందకు తీసుకొచ్చారు. మంటలను అదుపుచేసేందుకు ఆరు ఫైరింజన్ల సహాయంతో అర్ధరాత్రి వరకు రెస్క్యూ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మంటల తీవ్రతకు కాంప్లెక్స్‌పైకి చేరుకున్న పలువురు బాధితులు.. తమను రక్షించాలంటూ సెల్‌ఫోన్ లైట్లతో సంకేతాలిచ్చారు. వారిని రెస్క్యూ టీం కాపాడింది. అయితే ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. వారిని ప్రశాంతి, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివలు గా గుర్తించారు. ఇంకా కాంప్లెక్స్ లోపల చాలా మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 14 అంతస్తులు గల స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను 1980లో నిర్మించారు.
ఫోన్లో మాట్లాడుతూ బాధితులకు ధైర్యం చెప్పిన అధికారులు
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారితో అధికారులు ఫోన్ల్లో మాట్లాడారు. భయాందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో డీసీపీ చందనాదీప్తీ, ఏసీపీ రమేష్, సీఐలు, ఎస్ఐలు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
7వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి 7వ అంతస్తు నుంచి సెల్‌ఫోన్ లైట్ చూపిస్తూ కేబుల్ వైర్‌తో దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గమనించిన డీసీపీ చందనాదీప్తీ బాధితున్ని దూకొద్దంటూ సూచించారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అందరిని రక్షిస్తామంటూ భరోసా ఇచ్చారు. దాంతో బాధితుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
జీడిమెట్లలోనూ భారీ అగ్నిప్రమాదం
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఫార్మా కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూతపడిన ఫార్మా కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసిపడడం, సాల్వెంట్ డ్రమ్‌లు గాల్లోకి ఎగిరిపడడంతో పరిసర ప్రాంతాల వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలల్లో విచారణ చేపట్టారు.