Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న పంటలు.. మంచు తుఫానుగా వికారాబాద్ జిల్లా
నవతెలంగాణ-విలేకరులు
ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వడగండ్ల వాన దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వానతో ఎటుచూసినా వడగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వికారాబాద్ జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన కురవడంతో మంచు తుఫాను వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తోంది. కాగా, భారీ వడగండ్ల వానకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆస్తినష్టం జరిగింది. వాహనాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, వడగండ్ల వానతో తడిసి రంగు మారిన మిర్చి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
వికారాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. జిల్లాలోని మర్పల్లి, కోట్‌పల్లి, పూడూర్, పరిగి మండలాల్లో ఏకధాటిగా గంట పాటు కురిసిన వడగండ్లతో ఆ ప్రాంతం మొత్తం నేలపై మంచు గడ్డలు పరుచుకున్నాయి. ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పింద దశలో ఉన్న మామిడి నేలమట్టమైంది. వరి పూత దశ నుంచి కంకిగా మారే దశలో నేలరాలింది. మొక్కజొన్న, జొన్న, అరటి, కూరగాయల పంటల నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా మర్పల్లి మండలంలో భారీగా వడగండ్లు పడటంతో పాత ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇండ్ల ఎదుట నిలిచిన వాహనాలు ధ్వంసయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో యాచారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో ఫౌల్ట్రీ ఫామ్స్, ఇండ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. వరి పంట వంగిపోయింది. వడగండ్లు పడటంతో ఇద్దరు మహిళల తలకు, పలువురి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దాంతో పొట్ట కొచ్చిన వరి, నిమ్మ, మామిడి, బత్తాయి, తోటలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. నాంపల్లి మండలంలో వడగండ్ల వర్షానికి నివాస గృహాలపై ఉన్న సిమెంటు రేకులు పలుచోట్ల పగిలిపోగా కొన్నిచోట్ల గాలికి ఎగిరిపోయాయి. బత్తాయి, నిమ్మ, మామిడి, సపోటా తోటల్లో పిందెలు రాలిపోయి రైతులకు అపార నష్టం వాటిల్లింది. నివాస గృహంలోకి వరద నీరు ప్రవేశించి బియ్యం బస్తాలు, బట్టలు, ఎలక్ట్రికల్ సామగ్రి తడిసి ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మర్రిగూడలో ఈ ఏడాది పత్తితో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు, వడగండ్ల వాన తెచ్చిన నష్టాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. చెట్లు నేలకొరిగాయి. మిర్యాలగూడ పట్టణకేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రవణ్‌రెడ్డి ఇంట్లో పిడుగు పడటంతో షార్ట్‌సర్య్కూట్ అయి రూ.9లక్షల విలువగల ఫర్నీచర్ దగ్ధమైంది. పెద్దవూర మండలంలో కల్లాల్లో ఎండబెట్టిన మిర్చి తడిసిపోయినట్టు తెలుస్తోంది. చేతికి వచ్చిన మిర్చి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులకు సమయానికి పట్టాలు లేకపోవడంతో మిర్చి తడిసిపోయిందని ఆందోళన చెందుతున్నారు.మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ళ వానతో చేతికొచ్చిన పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. రూ.లక్షలు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టుకోగా ఆకాల వర్షంతో రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు, గణపురం మండల్లాలోని పలు గ్రామాల్లో మిర్చి పంట తడిసి ముద్దయింది. సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షానికి రహదారులు, మురికి కాల్వలు పొంగిపొర్లాయి. మామిడి తోటలో కాయలు నేల రాలిపోయాయి.
ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షానికి రోడ్లు, వాగులు, డ్రయినేజీలు పొంగిపొర్లాయి. ఆయా మండలాల్లో మొక్క జొన్న పంట నేలకొరిగింది. ఎకరాకు సుమారు రూ.50 వేల పెట్టుబడి పెట్టామని, మాయదారి వర్షం వచ్చి పంట నష్ట పరిచిందని రైతులు వాపోయారు. తమకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. సుమారు రెండు గంటలపాటు వర్షం కురవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారీగా కురవడంతో గోదావరి బ్రిడ్జిలపై వాహనరాకపోకలు నిలిచిపోయాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో వరి పంట కోతకు వచ్చే దశలో ఉండటంతో నేలకొరిగింది. చర్ల మండలం మామిడిగూడెం గ్రామ శివారులో గొర్రెలు మేత మేస్తున్న ప్రదేశంలో పిడుగుపడటంతో 15 జీవాలు మృత్యువాతపడ్డాయి.
50 ఎకరాల్లో మామిడి తోట దెబ్బతింది : కౌలు రైతులు తబీరేస్, ఇస్సాం, వికారాబాద్ జిల్లా
50 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాం. ఏడాది పాటు కాయకష్టం చేసి తోటను పసిబిడ్డలా కాపాడుకున్నాం. ఏ తెగుళ్లు రాకుండా ఖరీదైన మందులు పిచికారి చేసి పూత నుంచి కాత వరకూ జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పటి వరకు రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టా. పంట చేతికి వస్తాదని అనుకున్న సమయంలో అకాల వర్షం.. గద్ద వచ్చి కోడి పిల్లలను ఎత్తికెళ్లిన చందంగా పంట అంతా నాశనం చేసింది. మామిడి కాయలు మొత్తం నేలరాలాయి. తోట మొత్తం దెబ్బతింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ తమ గోడు వెల్లబోసుకున్నారు.
రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- పలుచోట్ల వడగండ్ల వాన పడే అవకాశం
- 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- వికారాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వడగండ్ల వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి నాగరత్న తెలిపారు. పలు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కూడా పడొచ్చని హెచ్చరించారు. బంగ్లాదేశ్ పరిసరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు మీదుగా కర్నాటక, గోవా, ఉత్తర కొంకణ్ వరకు మరొక ద్రోణి నెలకొంది. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల మేరకు తగ్గాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్ష పాతం రికార్డయింది. గురువారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 300కిపైగా ప్రాంతాల్లో వర్షం పడినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన పడింది. భూమిపై తెల్లటి రాళ్ల కుప్పపోసినట్టు వడగండ్లు పడ్డాయి. శుక్రవారం పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం, అక్కడక్కడా వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాలకు సంబంధించి పలు జిల్లా లకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.