Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, దీనికి కారణమైన మంత్రి కేటీఆర్‌ను భర్తరఫ్ చేసి నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ కుమార్ శుక్రవారం నిరసన దీక్షకు దిగనున్నారు. తొలుత ఆయన గన్‌పార్కులోని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు దిగుతారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
బీజేవైఎం కార్యకర్తల అరెస్టును ఖండిస్తున్నాం : తరుణ్‌చుగ్
టీఎస్పీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయం కోసం ఓయూలో శాంతియుత ర్యాలీ చేసిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని తప్పుబట్టారు.
ప్రస్తుత సంక్షోభానికి కేసీఆర్ అసమర్థత, నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పేపర్ లీకేజీలపై కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.