Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
జనగామ జిల్లా రఘనాథ పల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో తారా కెమికల్ ఇండిస్టీస్ ముందు గురువారం పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాధిత గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కెమికల్ కంపెనీ పనులను నిలిపి వేయాలని గతంలో కంపెనీ నుంచి వెలువడే వాయువు వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, పక్కనే ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. కంపెనీ చుట్టుపక్కల అరకిలోమీటర్ వరకు ఉన్న వ్యవసాయ పంట భూముల్లో పంటలు రాకుండా, బోరుబావుల నీరు తాగడానికి కూడా వీలులేకుండా పోయిందన్నారు. కంపెనీ దగ్ధమయ్యి మూడేండ్లు గడుస్తున్నా అ చుట్టుపక్కల ఇంకా చెడు వాసనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లలో నీళ్ళు కలుషితమై కెమికల్ వాసన వచ్చి తాగడానికి కూడా పనికి రావడంలేదని తెలిపారు. ఇక ఫ్యాక్టరీ తెరిస్తే వ్యవసాయ భూములతో పాటు గ్రామాన్ని కూడా వదిలి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.