Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొరల చేతిలో ఉన్న తెలంగాణ విముక్తి చెందాలి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, ఇచ్చోడ
ప్రజల ఆస్తులు, దేశ సంపదను తన స్నేహితుడైన అదానీకి ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అదానీ కేవలం పదేండ్లలోనే అతి కుబేరుడిగా మారారని తెలిపారు. దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఆ పార్టీ చేపట్టిన 'హాథ్ సే హాథ్' జోడో పాదయాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రీ గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. తొలి రోజున చేపట్టిన ఈ యాత్రకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి హాజరయ్యారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి గురువారం పిప్రీలో ప్రారంభించిన ఈ పాదయాత్ర రాత్రి ఇచ్చోడకు చేరు కుంది. అక్కడ ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఉద్దేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేపడుతు న్నట్టు తెలిపారు. నీళ్లు, నియమకాలు, నిధులు, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీ అయిందన్నారు. వారి నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.25లక్షల కోట్లు లూటీ చేశారని, ఒక్క ఎకరానికి కూడా నీరు పారడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైన్ షాపులు బంద్ చేస్తామని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించేందుకే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. యాత్రలో మంథని, భద్రాచలం ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు రాములునాయక్, ప్రేమ్‌సాగర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యులు గండ్రత్ సుజాత, నాయకులు వన్నెల అశోక్, ఆడె గజేందర్ తదితరులు పాల్గొన్నారు.