Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయహౌ..జన చైతన్య యాత్ర పాటల సీడీ ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిని ఎండగట్టడమే లక్ష్యంగా జనచైతన్య యాత్ర కొనసాగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు తెలిపారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'జనచైతన్య యాత్ర' సాగుతున్న నేపథ్యంలో 'జయహౌ..జన చైతన్య యాత్ర' పాటల సీడీని గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో డీజీ నర్సింహారావు, సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు టీ సాగర్, టి జ్యోతి, రాష్ట్ర నాయకులు ఆర్ శ్రీరాంనాయక్, పీఎన్ఎం అధ్యక్షులు ఆనంద్, నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, కోట రమేష్ ఆధ్వర్యంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీ నర్సింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మూడు బస్సుయాత్రలు సాగుతాయని చెప్పారు. వీటి ప్రారంభ సభలకు సీపీఐ(ఎం) జాతీయ నాయకులు హాజరవుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థపై కేంద్రం దాడికి నిరసనగా ఈ యాత్రలను చేపడుతున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుందన్నారు. మొదటి యాత్ర శుక్రవారం వరంగల్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 23న ఆదిలాబాద్‌లో రెండో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రారంభం చేస్తారనీ, ఈనెల 24న నిజామాబాద్‌లో మూడో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ ఎ విజయరాఘవన్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కళాకారులతో సీడీని రూపొందించినట్టు తెలిపారు. 60మంది కళాకారులతో మూడు దళాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ కళా రూపాలు, పాటల ద్వారా కళాకారులు ప్రజల్ని చైతన్యపరుస్తారన్నారు.