Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్
- ఇందిరాపార్కు వద్ద 48 గంటల రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ-అడిక్ మెట్
రవాణారంగ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం వెంటనే ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 48 గంటల రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 4 శాతం వ్యాట్ అందిస్తున్న రవాణా రంగాన్ని ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయన్నారు. రాష్ట్ర రవాణా రంగంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే, కార్మికులకు ఏమైనా ప్రమాదాలు జరిగితే ఆదుకునే దిక్కులేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేరళ, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు యాక్సిడెంట్ బెనిఫిట్స్, వైద్యసహాయం, వారి పిల్లల చదువులకి స్కాలర్షిప్ వంటివి అందిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ 2019ను తెచ్చి అగ్రిగేటర్స్ పేరుతో రవాణారంగాన్ని మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ ఓనర్ కం డ్రైవర్స్‌గా ఉండే వారు తట్టుకోలేని విధంగా భారాలు వేసి వేధిస్తున్నదని విమర్శించారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ ఫెడరేషన్ నగర కార్యదర్శి అజరు బాబు మాట్లాడుతూ.. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా చూస్తూ భారాలు వేయడం, స్పెషల్ డ్రైవ్స్ పేరుతో చలానాలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2019 మోటార్ వాహన చట్టంలో తెచ్చిన సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నాయకులు ఎండీ కలీమ్, ఉమేష్ రెడ్డి, అహ్మద్‌ఖాన్, గౌస్, సురేష్, మహేష్, జునైద్, ఆర్బుస్ ఖాన్, ఇమ్రాన్, అనీఫ్ తదితరులు కూర్చున్నారు. అలాగే హరి, వాహిద్, ఇర్ఫాన్, మోయిన్, చాంద్‌బాషా, సుహన్,నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు.