Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేయూ సెమినార్లో.. సీతారాం ఏచూరి
- రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం : బోయినిపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం హిందూత్వ ఎజెండాతో దేశ సమాఖ్య స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాలులో యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ తాటికొండ రమేష్ అధ్యక్షతన పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్వహించిన 'చేంజింగ్ సినారియో ఆఫ్ ఫెడరలిజమ్' అంశంపై జరిగిన సింపోజియంలో ముఖ్య అతిధిగా సీతారాం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అంటూ నినాదాలిస్తోందని తెలిపారు. భారత రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలను రూపొందించి వివిధ శాఖలను కేటాయించడం జరిగిందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరిట రాష్ట్రాల సమ్మతి లేకుండా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. సీఏబీఈ(సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్) అనే సంస్థ విద్యారంగంలో చేసే మార్పులను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి విధాన నిర్ణయాలు చేయాల్సి ఉన్నా ఆ సంస్థ ఆ మేరకు పనిచేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల భాషలపై వివక్ష ప్రదర్శిస్తుందని, ఇది సరైంది కాదన్నారు. రాజ్యాంగంలోని నాలుగు స్తంభాల్లో ముఖ్యమైన సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్రం భాగస్వామ్యంతోనే సమాఖ్య మనుగడ సాధ్యమని స్పష్టంచేశారు. వివిధ కమిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై చాలా సిఫార్సులు చేశాయని, వాటిని అమలు చేయకపోవడం వల్లే సమాఖ్యకు ప్రమాదం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈడి 5,542 కేసులను నమోదు చేసినా, 0.5 శాతం కేసులు మాత్రమే నిరూపితమవుతున్నాయన్నారు. ఈ కేసులను నిరూపించడానికి ప్రయత్నించడం లేదన్నారు. దీనికి తెర వెనుక రాజకీయ కారణాలే మూలమని తెలిపారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికీ ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రాల శాసన వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యం పెరిగిందన్నారు. రాష్ట్రాల హక్కులపై కేంద్ర పెత్తనం పెరిగిందన్నారు. ఆర్టికల్స్ సవరణ చేయడానికి సమయం ఇవ్వాలే తప్పా పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. ఆహార పదార్ధాలపై జీఎస్టీ వేయడం సరైంది కాదన్నారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉప్పుపై ఆంగ్లేయులు పన్ను వేస్తే మహాత్మాగాంధీ దండి మార్చ్ నిర్వహించారని గుర్తు చేశారు. జీఎస్టీతో రాష్ట్రాలు కేంద్రం వద్ద బిక్షాటన చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసన వ్యవహారాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు జాతీయ బ్యాంకులను దోచుకున్నారని, ఇప్పుడు సహకార బ్యాంకుల వంతొచ్చిందని విమర్శించారు. ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక విలువ అని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో అందించారన్నారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం
రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మెన్ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం కూల్చి వేస్తే ప్రజా ఉద్యమం వచ్చిందని, దాంతో కేంద్రం తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. ప్రజల ఒత్తిడితో ఏదైనా సాధ్యమేనన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రాలపై పెత్తనం చేయలేదని, కేంద్రంలో ఏకపార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసే బిల్లు నేటికీ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఆ బిల్లును వెనక్కి పంపడం లేదు, ఆమోదముద్ర వేయడం లేదని తెలిపారు. ఈ బిల్లును ప్రవేశపెడితే యూనివర్సిటీలలో రిక్రూట్ మెంట్‌ను త్వరితగతిన చేసు కునే అవకాశ ముందన్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ బిల్లు గురించి గవర్నర్‌కు వివరించి వచ్చినా గవర్నర్ స్పందించడం లేదని, ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రం చేసే అప్పులు జాతీయ బ్యాంకుల నుంచి మాత్రమే తీసుకుంటుందన్నారు. కేవలం మూల ధన వ్యయం కోసమే ఈ అప్పులు చేయడం జరుగు తుందని, నీటిపారుదల ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ సంద ర్భంగా వీసీ తాటికొండ రమేష్, సీతారాం ఏచూరికి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, రిజిష్ట్రార్ ప్రొఫెసర్ టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- బోయినిపల్లి వినోద్‌కుమార్