Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపించి ముస్లిం యువతను ఉగ్రవాదం వైపునకు మరలిస్తున్న పీఎఫ్ఐకు చెందిన మరో ఐదుగురు కార్యకర్తలపై ఎన్ఐఏ అధికారులు మరో సప్లిమెంటరీ చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. తాజాగా సెక్షన్120బీ, 153ఏ తో పాటు పలు ఉగ్రవాద నిరోధక చట్టాల కింద తాజాగా షేక్ అబ్దుల్ రహీం, షేక్ వాహీద్ అలీ, జాఫరుల్లాఖాన్ పఠాన్, షేక్ రియాజ్ అహ్మద్, అబ్దుల్ వారిస్ అనే ఐదుగురు కార్యకర్తలపై ఈ ఛార్జిషీటును దాఖలు చేశారు. గతేడాది జులైలో నిజామాబాద్ జిల్లాలో తొలి సారిగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) పేరిట ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్నారనే ఆరోపణలపై నిజామాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న మొత్తం 11 మంది నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎన్ఐఏకు అప్పగించారు. దర్యాప్తును చేపట్టిన ఎన్ఐఏ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి పీఎఫ్ఐ ముస్లిం అమాయక యువతను సమీకరించి వారిలో ప్రేరేపిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలు, మత విద్వేష కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వారికి పీఎఫ్ఐ నాయకత్వం ఇస్తున్న ట్రైనింగ్‌ను బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే అరెస్టయిన ఐదుగురు నిందితులపైనా తాజాగా సప్లిమెంటరీ చార్జిషీటును ఎన్ఐఏ దాఖలు చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.