Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరహాలో బలోపేతమవ్వాలి : ఎన్ఐఈపీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ మిశ్రా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు వేగంగా అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఉన్నవిద్య, పాలసీ పరిశోధనా సంస్థ(సీపీఆర్‌హెచ్‌ఈ), జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలనా సంస్థ(ఎన్ఐఈపీఏ) డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ మిశ్రా ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత విద్యామండళ్ల సమావేశం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారివారి అభిప్రాయాలు, అనుమానాల నివృత్తి, సలహాలు, సూచనలతో కూడిన న్యూస్ లెటర్‌ను తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రదీప్‌కుమార్ మిశ్రా ముగింపు సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రగతి నివేదికను చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకటరమణ నివేదించారు. లింబాద్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మహిళలు పెద్దఎత్తున ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లోనే విద్యార్థుల ధ్రువపత్రాల వాస్తవికతను తెలుసుకునే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1200 ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, 67 ఆశ్రమ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్ షిప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదనీ, ఇప్పటిదాకా ఆరువేల మంది విద్యార్థులు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామక బోర్డు బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు వేల్స్, బంగోర్ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయనీ, మోడల్ కరికులమ్, పరిశోధనా ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెంకట రమణ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదన్నారు. టీహబ్ లాంటి సంస్థలు వర్సిటీల్లో ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు కూడా మాట్లాడారు.