Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- వరుస ట్వీట్లతో నిరసన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండించారు. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న ప్రచారం అవాస్తవమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించారని పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి కేంద్రం వివక్షను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి చేసిన వినతిపత్రాలను సైతం జతపరిచారు.
ట్వీట్ - 1
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది.
ట్వీట్ - 2
కేంద్రం మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ట్వీట్ - 3
2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంటులో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ - బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టింది. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం.
ట్వీట్ - 4
కేడబ్ల్యూడీటీ-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది. న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా సైతం ప్రకటించింది. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా హోదా ఇవ్వలేదు. ఇది రాజకీయ కక్ష కాదా?