Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో మేకలు, గొర్రెలపై విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవసరముందని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధనకార్యదర్శి ఉడుత రవిందర్ సూచించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మథుర జిల్లా ఫరాలోని కేంద్ర మేకల పరిశోధనా కేంద్రం (సీఐఆర్జీ) నిర్వహించిన పరిశ్రమలు, సైంటిస్టులు, రైతుల ముఖాముఖి కార్యక్రమంలో సీఐఆర్జీ ఆహ్వానంమేరకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున కేంద్రం గొర్రెలు లేదా మేకల పరిశోధన కేంద్రాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయంగా గొర్రెల పెంపకంలో ఉన్న గొల్ల, కురుమలు గొర్రెలు, మేకలను పెంచుతున్న వారి సమస్యలను చర్చించినట్టు తెలిపారు. ప్రధానంగా విస్తృత మేపుపద్ధతి (బయట మేపడం)లో జీవాలను పెంచుతుండడంలో ప్రస్తుతం మేత భూములు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవాల మేతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీని నుంచి రక్షించుకునేలా పాక్షిక సాంద్రపద్ధతిలో మేపుకునేలా ప్రభుత్వం, పరిశోధనా సంస్థలను పెంపకందారులను చైతన్యం చేయాలన్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు చిన్నపిల్లలకు పౌష్ఠికాహారం ఇస్తున్నట్టు జీవాలకు కూడా దాణా, మినరల్ మిక్సర్ లాంటివి అందించాలని కోరారు. మేకల్లో వచ్చే డెక్కవాపు, దొబ్బరోగం లాంటి వ్యాధికి సంబంధించిన టీకాలు కావాలని ఇవ్వాలని కోరారు. అలాగే ఉమ్మడి టీకాలుగా తీసుకురావాలన్నారు. మాంసానికి, పాలకు డిమాండ్ ఉన్నందున అధిక మాంసం, అధిక పాలను ఉత్పత్తి చేసే సంకర జాతులపై పరిశోధనలు పెంచాలని కోరారు. తద్వారా ఉత్పాదక పెంచి వినియోగానికి సరిపడా ఉత్పత్తి సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 11 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.