Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంతో సమగ్ర అభివృద్ధి
- మహిళా బిల్లుకు ప్రధాని మోడీ చొరవ చూపడం లేదు : రష్యా అధికారిక మీడియా సంస్థ స్ఫూత్నిక్ ఇంటర్వ్యూలో కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధాని మోడీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో రష్యా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ స్ఫూత్నిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే దేశం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టిందన్నారు. తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి దేవేగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టారనీ, ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులు ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఏ మాత్రం చొరవ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో రాజకీయ చిత్తశుద్ధి అవసరమన్నారు. రిజర్వేషన్ కోటాలో కోటా కావాలని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం పెడుతున్నాయనీ, ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తమ పార్టీ కేంద్రానికి సూచనలు ఇచ్చిందని తెలిపారు. కులగణనను చేపట్టి ఓబీసీ జనాభా లెక్కలు తీయాలన్నారు.
జనాభా లెక్కలు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ల అమలు సులభతరమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించామని కవిత గుర్తు చేశారు.