Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా దేశంలో అమలు చేెస్తున్న కార్పొరేట్-మతోన్మాద అనుకూల విధానాలపై ఏప్రిల్ 5న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పిలుపునిచ్చారు.. శుక్రవారం యాదాద్రి భువనగిరిజిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆద్వర్యంలో జరిగిన జిల్లా సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మోడీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ దేశీయ వ్యవసాయ రంగాన్ని, రైతాంగ భవితవ్యాన్ని తాకట్టు పెడుతోందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లుతో వ్యవసాయాన్ని అదానీ, అంబానీలకు కట్టబెడుతుందని విమర్శించారు. కార్మిక హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించి నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. పని దినాలు 200 పెంచి కనీస వేతనం రూ.600గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించకుండా రోజు రోజుకూ ప్రజలపై పెను భారాలు మోపుతుందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను ఉపయోగిం చుకుని మతం పేరుతో మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందన్నారు. బీజేపీ ప్రకటించిన అభివృద్ధి నినాదం కారుమబ్బులా కరిగిపోయిం దన్నారు. ఈ పరిస్థితుల్లో దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు పారిశ్రామిక ప్రగతికి సంపద సృష్టిలో రేయింబవళ్లు చెమటోడుస్తున్న కార్మికుల కష్టజీవుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన చలో ఢిిల్లీ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ, నాయకులు గొరిగె సోములు, రాములమ్మ, కుమారి, కందాటి సత్తిరెడ్డి, కోట రామచంద్రా రెడ్డి, మొగిలి పాక గోపాల్,కూరెళ్ళ నర్సింహ,బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహాంగీర్, గాడి శ్రీను,గోపాల్, మారయ్య పాల్గొన్నారు.