Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం : రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
- రెండు రోజుల్లో నివేదిక పంపాలని అధికారులకు ఆదేశం
- వికారాబాద్ జిల్లా మర్పల్లిలో పర్యటన
- వడగండ్లతో దెబ్బతిన్న పంటల పరిశీలన
నవతెలంగాణ-మర్పల్లి
వడగండ్ల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో మంత్రులు పర్యటించారు. మర్పల్లి మండలకేంద్రంతోపాటు కొత్లపురంలో పర్యటించి వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు, మొక్కజొన్న, ఉల్లి, టమాటా, క్యాబేజీ, జొన్న, కాలిఫ్లవర్, తదితర నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రైతుబంధు మన రాష్ట్రంలోనే ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను నీరు గార్చి రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదన్నారు. రైతు మరణం తర్వాత ఆ కుటుంబానికి రైతుబీమా ఆసరాగా నిలుస్తుందన్నారు. రెండు రోజుల్లోగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ విజయకుమార్, ఎంపీపీ బట్టు లలిత రమేష్, జడ్పీటీసీ మధుకర్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో రాజమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.