Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాన్ని సైతం లెక్క చేయక..
- సపరివార సమేతంగా తరలొచ్చిన జనం
నవతెలంగాణ -మట్టేవాడ/హన్మకొండ/వరంగల్
సీపీఐ(ఎం) జెండాలతో ఓరుగల్లు నగరం ఎరుపుమయమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభవైపు సాగిన జన సమూహాన్ని చూసి వరుణుడే శాంతించాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జన చైతన్య యాత్ర శుక్రవారం మొదటిరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌లలో విజయవంతమైంది. వరంగల్‌లోని ఆజంజహీ మిల్లు గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేత బూని వరంగల్ నలువైపులా ఉన్న ప్రధాన కూడళ్లల నుంచి ఆటపాటలతో, డప్పు చప్పులతో, కోలాటాలు ఆడుతూ నినాదాలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎర్రటి చీరలు, ఎర్రని అంగీలతో రోడ్లను ఎరుపు మయం చేస్తూ భారీ ప్రదర్శన చేశారు. కోలాటాలు ఆడుతూ డబ్బు చప్పులతో డీజే మోతలతో ఎర్రజెండాలు చేత పట్టుకొని నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. కొత్తపేట పైడిపల్లి ఎమ్హెచ్నగర్ జక్కలొద్దీ రంగసాయిపేట్ బెస్తం చెరువు వంటి పలు ప్రాంతాల నుండి జనం భారీగా తరలివచ్చారు. సభ వేదికపై కార్యకర్తలను ఉత్సావంతులు చేసే విధంగా పాటలు, నృత్యాలు అలరించాయి. బహిరంగ సభలో పార్టీ అగ్ర నాయకులు మాట్లాడుతుంటే ప్రజల్లో ఆనందం వెల్లి విరిసింది. సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు. సీపీఐ(ఎం) తమకు అండగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పార్టీతో కలిసి పోరాటాలు చేసి చిరకాల స్వప్నం అయినా సొంతింటి కలను నెరవేర్చుకుంటామనే భరోసా ప్రజల్లో కనిపించింది. ఎవరిని అడిగినా పార్టీతో పాటు పోరాటాలు చేస్తామనే మాట సభ ప్రాంగణంలో ఎవరిని కలిపినా వినిపించింది.
హన్మకొండ కుడా గ్రౌండ్ ఎరుపుమయం
శుక్రవారం ఉదయం హనుమకొండలో నిర్వహించిన జన చైతన్య యాత్ర విజయవంతమైంది. యాత్ర అనుకున్న సమయానికి ఉదయం 9గంటలకు కాజీపేట జంక్షన్ నుంచి ప్రారంభమైంది. ఉదయం వర్షం పడుతున్నా జనం లెక్కచేయలేదు. పది గంటల వరకే కుడా గ్రౌండ్స్ నిండిపోయింది. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి. సభ ప్రారంభానికి ముందు వర్షం కొద్దిగా వెలిసినా సభ జరుగుతున్నంత సేపు చిరుజల్లులు పడినా ప్రజలు చివరిదాకా ఉన్నారు.
బీజేపీ గద్దె దింపుటకే నేను సైతం పోరాటంలో :ఓడపల్లి అనిత బెస్తం చెరువు
నేను సైతం జనచైతన్య యాత్రకు మేము సైతం అంటూ రెండు సంవత్సరాల బాబుతో తన తల్లి రావడం అక్కడికి వచ్చిన పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఒక కూతురు ఒక కొడుకుతో సభా ప్రాంగణానికి వచ్చాను. ఈ సభలో ముఖ్య నాయకులు మాట్లాడిన మాటలు వింటుంటే బీజేపీ ప్రభుత్వంను గద్దెదించే వరకు పోరాడుదామనే పోరాట పటిమ వచ్చింది. ముఖ్య నాయకులు అన్న మాటలు ఆసక్తిని కల్పించాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నిరుపేదల బతుకులు మరింత దారిద్య్రంలోకి వెళ్తున్నాయి. బీజేపీ గద్దె దింపుటకే నేను సైతం పోరాటంలో ఉంటాను.
పోరాట పటిమను నింపాయి : యాస్మిన్ కాశిబుగ్గ
ప్రజల హక్కులు దినదినం కోల్పోతున్నాం. ఎర్రజెండా అండతోనే మహిళల హక్కులను సాధించుకుంటాం. కులం, వర్గం మతం అసమానతలు బీజేపీలో పెట్రేగిపోతున్నాయి. మహిళలపై హత్యలు లైంగికదాడులు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఐక్యమత్యంతో అందరం ఉద్యమించాలని ముఖ్య నాయకులు చెప్పిన మాటలు మాలో పోరాటపటిమను పెంపొందించాయి.