Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఎకరాల పంట నష్టం
- వికారాబాద్ జిల్లా మర్పల్లిలో తీవ్ర ప్రభావం
- న్యాయం చేస్తామని మంత్రుల హామీ
- ఖమ్మంలో మొక్కజొన్న, వరికి నష్టం
వికారాబాద్ జిల్లా మర్పల్లి ప్రాంతంలో ఏ రైతును మందలించిన బరువెక్కిన గుండెలతో తమ గోడును వెల్లబోసుకున్నారు. అకాల వడగండ్ల వర్షం అన్నదాత ఆశలను ఆవిరి చేసింది. పచ్చగా కళకళలాడుతున్న పంట జూసి మురిసిపోయిన రైతు మురిపం.. ఒక్కరోజు వ్యవధిలోనే చిన్నాభిన్నమైంది. చేతికొచ్చిన పంటను ప్రకృతి నేలమట్టం చేసింది. వడగండ్ల వానతో తన చెమట కష్టం కండ్ల ముందే పాడైపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట సాగుకు చేసిన అప్పు తీర్చేది ఎలా అని ఆందోళన చెందుతు న్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకదాటిగా వడగండ్ల వర్షం పడటంతో వరి, మామిడి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంట నష్టంపై ప్రత్యేక కథనం.
ఎకరా రూ.30 వేల చొప్పున 50 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాం. కౌలు కింద. రూ. కోటీ 50 లక్షలు చెల్లించాం. పెట్టుబడికి మరో రూ. కోటీ ఖర్చయింది. మామిడి చెట్లు పూత దశ నుంచి పింద దశలో ఉంది. ఈ సమయంలో వడగండ్ల వర్షం కురవడంతో పూర్తి స్థాయిలో పూత, కాత మొత్తం నేలరాలింది. తమకు చావు తప్ప మరో మార్గం లేదు.
- తబీరేస్, ఇస్సాం, కౌలు రైతులు, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం.
నవతెలంగాణ- రంగారెడ్డి, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అకాల వడగండ్ల వర్షంతో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో 1,003 ఎకరాల్లో వివిధ పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధికంగా వరి పంట 787 ఎకరాల్లో దెబ్బతింది. వికారాబాద్లో 893 ఎకరాల్లో రూ.48.22 లక్షల విలువ గల పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో వరితో పాటు 139 ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. రంగారెడ్డిలో జిల్లాలోని యాచారం, మంచాల, అమనగల్ మండలాల్లో సుమారు 849 ఎకరాల్లోని వరి, టమటా, మామిడి పంటలు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో మర్పల్లి, మోమిన్పేట్ మండలలోని 15 గ్రామాల్లో అత్యధికంగా ఆస్తినష్టం వాటిల్లింది.
వంద శాతం నష్టం..
మర్పల్లి మండలంలోని మర్పల్లి కాలన్ గ్రామం, కోట్పల్లి మండలంలో కోట్పల్లి గ్రామాల్లో పంటలు వందశాతం నష్టపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వర్షం పడటంతో మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, శుక్రవారం మర్పల్లి మండలంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డిల బృందం పర్యటించింది. పంట నష్టం అంచనా వేసి, రెండ్రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించింది. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.
ఖమ్మంలో నేలకొరిగిన మొక్కజొన్న, వరి
అన్నదాతను అకాలవర్షం ఆగమాగం చేసింది. ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మొక్కజొన్న, మామిడి, వరి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధిక పంటనష్టాలు వాటిల్లాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైరా ఎమ్మెల్యే రాములునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల, ఇతర వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. వైరా మండలం ఖానాపురం, రెబ్బవరం ప్రాంతాల్లో నేలవాలిన మొక్కజొన్న చేలను చూశారు. మొత్తంగా జిల్లాలో 9130 మంది రైతులకు చెందిన 18,826 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టవాటిల్లినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 31 రైతులకు చెందిన 53 ఎకరాల్లో పెసర పంట నీటిపాలైనట్టు చెబుతున్నారు. అలాగే పిందె, కాయ దశలో ఉన్న మామిడి నేలరాలింది. భారీ వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి జేకే 5 ఓసీలో బగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వేసిన వరిలో అత్యధికం పొట్టదశలో ఉంది. 80వేల ఎకరాల్లో వేసిన మిర్చి కోత, కల్లాల్లో ఆరబోసి ఉంది. వరి పనలు నేలకొరగగా.. మిర్చి వర్షార్పణం కాకుండా కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో నీటిపాలైంది.
వడగండ్లు మా బతుకును అగం చేసింది
నాలుగు ఎకరాల్లో టమాటా, ఒక ఎకరా కాలీఫ్లవర్ సాగు చేశా. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాను. సుమారు రూ.పది లక్షలకు పైగా దిగుబడి వస్తోందనుకున్నా. వడగండ్ల వర్షంతో పంటలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు.
- శ్రీనివాస్, కూరగాయాల సాగు రైతు
రెండు ఎకరాల పంట నేలవాలింది
గీ పంటే నాకు బతుకుదెరువు అనుకున్నా.. పస్తులుండి పంటకు పెట్టు బడి పెట్టిన. చేతికి వచ్చిన పంట నేల పాలైంది. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. మా గోస చూసి మమ్మల్ని ప్రభు త్వమే అదుకోవాలి.
- నజీర్, మొక్కజొన్న రైతు మర్పల్లి