Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టంగా కలుస్తున్న 'చేతు'లు
- కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి యాత్ర
- భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం
- అనుమతి రాగానే ఉత్తమ్ లేదా మధుయాష్కీ యాత్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది.తెలంగాణలో ప్రతి ఒక్కరూ జనంలోనే ఉండేలా ఏఐసీసీ చర్యలు చేపట్టింది. వ్యక్తి కేంద్రీకరణ కాకుండా సమిష్టిగానే నాయకులు ప్రజల్లోకి పోవాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా అంతర్గత కొట్లాటల్లో మునిగిపోయిన కాంగ్రెస్ నేతలకు చేతినిండా పని పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో హాత్ సే హాత్ యాత్ర చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ప్రభావం వేసేందుకు చేసే యాత్రలు ఏమేరకు కల్సిస్తాయే చూడాలి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 30 రోజులుగా హాత్‌సేహాత్ యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాత్రకు కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఎడమొహం, పెడమొహంగా ఉన్న కొందరు సీనియర్ల నోర్లు మూతపడ్డాయి. ఏఐసీసీ పర్యవేక్షణ ఉండటంతో సీనియర్లు కూడా ఇండ్లలో ఉండకుండా జనంలోనే ఉంటున్నారు.
యాత్రలకు సహకరించాల్సిందే.
రేవంత్‌రెడ్డి తర్వాత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు ఏఐసీసీ అనుమతినిచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగనుంది. ములుగు జిల్లాలోని సమ్మక్క, సారక్క ఆలయం నుంచి ఆరంభమైన రేవంత్ యాత్ర నిరంతరంగా సాగుతున్నది. ప్రజలను కలుస్తూ...సమస్యలు వింటూనే అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడా త్వరలోనే హాత్ సేత హాత్ యాత్ర చేయనున్నారు. వారి షెడ్యూల్‌ను ఏఐసీసీ ప్రకటించనుంది. రాష్ట్ర నలువైపు నుంచి యాత్రలు చేయడం ద్వారా పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నది. ఎవరెన్ని యాత్రలు చేసినా తుదకు కాంగ్రెస్ ఖాతాలోనే ఓట్లు పడతాయని నేతలకు ఉద్భోదిస్తున్నది. బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమనే ప్రచారాన్ని హస్తం పార్టీ వెనక్కి కొట్టిందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసిందని హస్తం నేతల్లో హుషారుంది.
కాదు, కూడదంటే మీ దారి మీరు చూసుకోండి
పాదయాత్ర చేసేందుకు ఏ నాయకుడికి అనుమతి ఇచ్చినా మిగతా నేతలు సహకరించాలంటూ సూచిస్తున్నది. కాదు కూడదంటే మీ దారి మీరు చేసుకోవాలని చెబుతున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. అధిష్టానం పదవులు కావాలన్నా, ఎమ్మెల్యే టికెట్ దక్కాలన్నా పార్టీ కోసం కష్టపడాలంటూ అధినాయకత్వం చెబుతున్నది. పార్టీ కోసం పని చేయకపోతే పదవులు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలిస్తున్నది. చెట్టెక్కి తన కొమ్మను తానే నర్కుకున్నట్టు...పార్టీలో ఉంటూనే పార్టీ నేతలనే విమర్శించే నాయకులపై కొరడ ఝలిపించేందుకు వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హాత్ సే హాత్ యాత్ర చేయడంతోపాటు ఎప్పటికప్పడు ప్రగతి నివేదికను పార్టీకి తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి నుంచి యాత్రలు చేస్తున్నారు. కానీ, కొంత మంది సీనియర్ నేతలు మాత్రం అధిష్టానం సూచనను పెడచెవిన పెడుతున్నట్టు పార్టీ భావిస్తున్నది. అలాంటి వారు కాంగ్రెస్‌లో ఉన్నారా? లేక బీఆర్ఎస్, బీజేపీకి టచ్‌లో ఉన్నారా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. అటువంటి నేతలకు వీలైనంత వరకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నది.
సమిష్టి నాయకత్వం కోసం యాత్రలకు అనుమతి
పార్టీలో వ్యక్తిస్వామ్యం కాకుండా సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఏఐసీసీ యాత్రలకు అనుమతి ఇచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశాన్ని పక్కన పెడితే... పార్టీ కోసం అందరూ కష్టపడాల్సిందేనంటూ నేతలకు అగ్రనేతలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీ నుంచి వచ్చినా సరే...రేవంత్ సామర్థ్యానికి గుర్తించి ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవినే కట్టబెట్టారు. ఆ తర్వాత పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రేవంత్ రాకతో పార్టీ నుంచి వలసలు ఆగిపోయాయి. దాంతో క్యాడర్లో మరిన్ని ఆశలు పెరిగాయి. అయినప్పటికి సమిష్టి ఆలోచ నలు, నాయకత్వం ఉండటం ద్వారానే పార్టీ పురోగతి సాధిస్తుందనే అవగాహనను ఏఐసీసీ కల్పిస్తున్నది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌కు అన్ని తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం పార్టీలోనే ఆ స్థాయి నేత లేకుండా పోయారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా బలమైన నాయకత్వం ఎదగలేదు. ఈ నేపథ్యంలో అధిష్టానం అంతర్గతంగా అనేక సంస్కరణలు చేపట్టి, సమిష్టి నాయకత్వంపై దృష్టిసారించింది. కర్ణాటక రాష్ట్రంలో డికె శివకుమార్, సిద్దా రామయ్య మధ్య పరిస్థితి పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో ఉన్నది. ఈ క్రమంలో అధిష్టానం రంగంలోకి దిగి వారిద్దరి మధ్య ఓ ఒప్పందాన్ని కుదుర్చినట్టు తెలిసింది. ఆ తర్వాతే అక్కడ బీజేపీని కాంగ్రెస్ ఢ కొట్టే పరిస్థితి వచ్చిందని నేతలు చెబుతున్నారు.