Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు అధికారులకు సీఐడీ డీజీ ఆదేశాలు
- పిల్లలపై లైంగిక వేధింపులు పెరగడం పట్ల ఆందోళన
- అధికారులతో సమీక్ష జరిపిన మహేష్ భగవత్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు పెరగడం పట్ల సీఐడీ డీజీ మహేశ్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే కేసులకు సంబంధించి ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవలి కాలంలో సీఐడీలో చైల్డ్ సెక్సూవల్ అబ్యూసివ్ (సీఎస్ఏ) కేసులు 44 నమోదు కాగా అందులో 31 కేసులకు సంబంధించి 42 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. పోలీసుల దృష్టికి రాని సంఘటనలు, పోలీసు కేసు పెట్టాలనే విషయంలో వెనుకంజ వేసే వారు కూడా ఉంటారని వారిలో తమకు న్యాయం జరుగుతుందనే భరోసాను కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మహేశ్ భగవత్ అన్నారు. సున్నితమైన ఈ కేసుల దర్యాప్తులో అధికారులు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిం చాల్సినవసరం ఉన్నదని ఆయన తెలిపారు. కోర్టులకు ఈ కేసులలో చార్జిషీటులు సమర్పించే సమయంలో సైతం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయపరంగా తగిన సూచన లు సలహాలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సీఎస్ఏకు సంబంధించి అవి జరిగే విధానాలు, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, కేసుల దర్యాప్తు సందర్భంలో పాటించాల్సిన జాగ్రత్తలు, కేసులలో నేరస్థుల అరెస్టులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్రం జారీ చేసిన సూచనలతో కూడిన మెటేరియల్స్ను రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు అందచేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇలాంటి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఇప్పటి వరకు మంచి ఫలితాలను సాధించారని అన్నారు. కోర్టులలో పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసుల పట్ల కూడా తగిన శ్రద్ద వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీఎస్ఏ కేసుల డీసీపీ స్నేహ మెహ్రా, సీఐడీ అదనపు ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ గుణశేఖర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.