Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగణలో కులగణన చేపట్టాలి
- బీసీ సంక్షేమ సంఘం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించొద్దనీ,జనగణనలో కుల గణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్‌గౌడ్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సామాజిక తరగతులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులను కేటాయించాలని కోరారు. సంపద సృష్టించటంలో మన వాటా ఉన్నప్పుడు..ఆ సంపదను పంచేటప్పుడు మన వాటా మనకెందుకివ్వరని ప్రశ్నించారు. పాలకులు చేస్తున్న అప్పుల్లోనూ వివిధ కులాల వాటా కడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీసీలంటే భయపడుతున్నదని చెప్పారు. అందుకే కుల గణన చేయటం లేదని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించొద్దని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు అభివద్ధి చెందకుండా భారతదేశం అగ్రదేశంగా ఎలా తయారవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంతరావు మాట్లాడుతూ నాగపూర్‌లో ఉన్న దుకాణం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి వ్యతిరేకమని చెప్పారు. దాన్ని కాదని మోడీ సర్కార్ బీసీలకు ఏమీ చేయలేరని విమర్శించారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కొదండరాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల బీసీల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నదని చెప్పారు. ఒక్క బీసీలకే కానీ, ఆర్థిక, సామాజిక బాధలు అనుభవిస్తున్న అన్ని తరగతులు ఏకమై ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాని పిలుపునిచ్చారు. ఎవరెంత మంది ఉన్నారనే విషయాన్ని తేల్చటంలో కేంద్రం ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని ప్రశ్నించారు. జనగణనకోసం పెద్ద ఉద్యమం రావాలన్నారు. లోక్‌సత్తా నాయకులు మన్నారం నాగరాజు మాట్లా డుతూ బడ్జెట్లో బీసీల అభివృద్ధికి రెండు వేల కోట్లు కేటాయిస్తే..బండి సంజరు, కె లక్ష్మణ్ ఆ అంశంపై కనీసం మాట్లాడలేదని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ, లోక్‌సత్తా, సీపీఐ(ఎంఎల్), ఆర్పీఐ, తదితర పార్టీల నాయకులు పాల్గొన్ని ప్రసంగించారు.ఈ సమావేశంలో 12 తీర్మానాలు ఆమోదించారు. భవిష్యత్ పోరాటాన్ని ప్రకటించారు.