Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేషరతుగా క్షమాపణ చెప్పాలి : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలంటూ అసలు కోరనేలేదని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. ఆయన తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వాస్తవాలతో కూడిన తాజా ప్రకటనను పార్లమెంట్ లో ప్రకటించాలని, లేదంటే మంత్రిపై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నదిపై పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నందున ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హౌదా ఇవ్వాలని 2018 జూలై 20న తాను కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో ప్రధాని మోడీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. తన మాటలు పార్లమెంటు రికార్డుల్లో ఉన్నాయని వాటిని తెప్పించుకుని వింటే వాస్తవాలు తేలతాయని స్పష్టం చేశారు.