Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల శాసనమండలి సభ్యులు ఎల్.రమణ శనివారం ఒక ప్రకటనలో దన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన అజాంజాహి మిల్లు గతంలో మూత పడిందనీ, దీంతో అందులో పని చేసిన కార్మికులతో పాటు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాకు చెందిన నేత కార్మికులు రాష్ట్రంలో పని లేక భీవండి, సోలాపూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాలకు వలసపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నేత కళాకారుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి, చేనేత, మరనేత వృత్తిలో ఉన్న వారికి అనేక ప్రోత్సాహకాలు అందించారని పేర్కొన్నారు. కేంద్ర జౌళి శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులను మంత్రి కేటీఆర్ స్వయంగా కలిసి, అనేక సార్లు మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. ఇదే సమయంలో చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత క్లస్టర్లను మంజూరు చేసి కళాకారుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రద్దు చేసిన హ్యాండ్లూమ్ బోర్డ్‌ను పునరుద్దరించాలని ఆయన డిమాండ్ చేశారు.