Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసరాల ధరలతో నిరుపేదలపై భారాలు: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు
నవతెలంగాణ-శంకర్పల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదాని ఆస్తులు పెంచుతూ.. ప్రజలపై భారాలు మోపుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. గ్యాస్, డిజీల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి నిరుపేదలపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీ, జీపు జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కార్పొరేట్ల ఆదాయం పెరిగిందనీ, పేదల జీవనం భారమైందనీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి చేవెళ్ల డివిజన్ కన్వీనర్ దేవేందర్, రైతు సంఘం శంకర్పల్లి మండల అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, శ్రీనివాస్, బీసీడబ్ల్యూ చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు ప్రభుదాస్, శంకర్పల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బి.సోల్ల రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.