Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు టీఎస్యూఈఈయూ మద్దతు
- వీఎస్టీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉత్తరప్రదేశ్లో విద్యుత్ సంస్థల్ని ప్రయివేటీకరించే ప్రయత్నాలను అక్కడి బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్యూఈఈయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే ఈశ్వరరావు, వీ గోవర్థన్ డిమాండ్ చేశారు. యోగీ ఆదిత్యానాధ్ ప్రభుత్వం గత డిసెంబర్లోనే ప్రయివేటీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టిందనీ, దీన్ని గమనించి అక్కడి విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసనలు, అందోళనలు చేపట్టారని తెలిపారు. ఉద్యోగుల ఐక్య పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని చెప్పారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ వీఎస్టీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్న విద్యుత్ సవరణ చట్టం-2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా అల్టిమేటం ఇవ్వడంతో తాత్కాలికంగా ప్రయివేటీకరణ ప్రయత్నాలు వాయిదా వేసుకొని, మళ్లీ ఇప్పుడు వాటిని వేగవంతం చేస్తున్నారని వివరించారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్ కర్మచారి సంఘర్షణ సమితి సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల పట్ల ఇలాంటి వైఖరినే అవలంబిస్తున్నదనీ, గతంలో కాశ్మీర్, చండీగఢ్, పుదుచ్చేరి, మహారాష్ట్రల్లో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు 86వేల మంది ఈ ఏడాది జనవరిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారనీ, 72 గంటలు సమ్మె చేస్తున్నట్టు హెచ్చరించడంతో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణను అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారనీ, అయినా కేంద్రంలోని మోడీ సర్కారుకు బుద్ధి రావట్లేదని విమర్శించారు. యూపీ ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలనీ, లేనిపక్షంలో భవిష్యత్లో వినియోగదారులు, రైతుల్ని కలుపుకొని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్, సెంట్రల్ సర్కిల్ నాయకులు కిరణ్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.