Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అన్నదాతకు ఆ రాత్రి కాలరాత్రిగా మిగిలింది. ఒక రాత్రి కురిసిన వర్షం ఎంతోమంది రైతు కుటుంబాల కష్టాన్ని నేలపాలు చేసింది. పచ్చని చేలు నీటిలో మునిగిపోయాయి. పిడుగుపాటుకు రైతు ప్రాణాలే విడిచాడు. పశుపక్షాదులు బిక్కుబిక్కుమంటూ బీకరిల్లాయి. పశువులు మృతి చెందాయి. రోడ్లకు అడ్డంగా వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది మహబూబాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వాన బీభత్సం. ఉరుములు, మెరుపులు వడగండ్లతో రాత్రంతా కురిసిన వర్షం.. అటు రైతులకు ఇటు గుడిసెల్లో ఉన్న పేదలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎన్నో గుడిసెలు చేయడం నేలమట్టం అయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా 18మండలాలకు గాను 15 మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. 139 గ్రామాల్లో 7567 మంది రైతులకు నష్టం కలిగించినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మామిడి, వరి, మిర్చి, కంది, కూరగాయల పంటలకు తీరని నష్టం కలిగించింది. అలాగే జిల్లా వ్యాప్తంగా 9690 ఎకరాలలో మొక్కజొన్న పంటలు నేలకొరిగి విరిగి పనికి రాకుండా పోయాయి. 4890 ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. 630 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. 3050 ఎకరాల్లో మామిడి మామిడి కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మిర్చి రైతుల పరిస్థితి దయనేయంగా ఉంది. మిర్చి తోటలోనే కోతకు వచ్చిన కాయలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మిర్చి కల్లాలు తడిసి మిర్చి నాణ్యత కోల్పోయింది. జిల్లాలో పెద్దవంగర, తొర్రూరు, మహబూబాబాద్, మరిపెడ మండలాల్లో మామిడి పంటకు తీరని నష్టం జరిగింది. గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామంలో ఇంటి గోడ కూలి ధరంషోర్ శంకర్ అనే గిరిజన రైతు మృతి చెందాడు. అర్ధరాత్రి పిడుగుతో రైతు మృతిచెందగా.. ఆ కుటుంబ ఒంటరిగా మిగిలింది. పెద్ద వంగర మండలంలో వర్ష బీభత్వానికి పశవులు మతి చెందాయి. నెల్లికుదురు మండలం మునిగళ్ళ వీడు గ్రామంలో ఇండ్లు దెబ్బతిన్నాయి. బ్రాహ్మణ కొత్తపెల్లి గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. పెద్ద వంగర, కొత్తగూడ మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మహబూబాబాద్ పట్టణంలో మురికి కాలువలు పొంగిపొర్లాయి. శివారు కాలనీలు నీటిమట్టమయ్యాయి. పలు కాలనీల గుడిసెల్లో నీళ్లు నిలిచాయి.
76.6 మిల్లి మీటర్ల వర్షపాతం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 64 మిల్లీమీటర్ల కాగా 76.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా గార్ల మండలంలో 97.4 ఎంఎం వర్షపాతం, కొత్తగూడెం మండలంలో 52.4, బయ్యారంలో 44.4, డోర్నకల్‌లో 55.0, కొరివిలో 30.2, మహబూబాబాద్‌లో 93.2, గూడూరులో 65.4, కేసముద్రంలో 61.0, నెల్లికుదురులో 81.4, నరసింహులపేటలో 53.6, మరిపెడలో 79.4, తొర్రూర్ లో 52.6 వర్షపాతం నమోదైంది.
నష్టపరిహారం అంచనా వేసి రైతులకు చెల్లించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
జిల్లా అధికార యంత్రాంగం తక్షణ స్పందించి నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేసేలా ప్రతి గ్రామాన్ని సందర్శించాలి. రెండేండ్లుగా కురుస్తున్న అకాల వర్షాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశద్ధితో పరిహారం అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి.
వడగండ్ల వానతో..30గొర్రెలు మృత్యువాత
శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం గొర్రెల కాపరులకు విషాదం మిగిల్చింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండరలం నుస్తులాపూర్‌కు చెందిన పలువురు గొర్రెల కాపర్లు నుస్తులాపూర్ గ్రామ శివారులో గొర్రెలను దొడ్డి పెట్టీ ఉంచారు. శనివారం రాత్రి కురిసిన రాళ్ల వానకు 30గొర్లు మృత్యువాత పడ్డాయి. రూ.3లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపర్లు వేడుకుంటున్నారు.