Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం విమానాశ్రయం లేనట్టేనా..?
- 2008లో ఎయిర్‌పోర్టు సర్వే మొదలు
- కేంద్రం చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చక్కర్లు
- ఏదో ఒక అభ్యంతరం తెలుపుతున్న కేంద్రం
- కేంద్రం చెప్పినట్టు స్థలం మార్చినా నిరాకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలో ఎయిర్‌పోర్టు కలగానే మిగిలింది. కేంద్రప్రభుత్వం చెప్పిన ప్రకారంగా స్థలం మార్చినా.. మోడీ సర్కారు మొండిగానే వ్యవహరిస్తోంది. 2015 నుంచి 2017 వరకు కాస్త సానుకూలంగా వ్యవహరించడంతో ఎయిర్‌పోర్టు కలనెరవేరినట్టేనని అందరూ భావించినా.. ఆతర్వాత అడుగు ముందుకు పడలేదు.
నవతెలంగాణ - ఖమ్మంప్రాంతీయప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మెట్రోపాలిటిన్ నగరాల నుంచి జిల్లా ప్రధాన కార్యాలయాలకు ఎయిర్ కనెక్టివిటీని విస్తరించడంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం నిర్మించడానికి భూసేకరణ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2008 ఉంచి సర్వే మొదలైంది. కొత్తగూడెం పట్టణానికి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాన్ని ప్రతిపాదించారు. 2021న జనవరి 6న విమానాశ్రయ అధికారులు ప్రతిపాదిత భూమిని సందర్శించారు.
2015 నుంచి ప్రయత్నించినా..
ఫలితం శూన్యం
2015 నుంచి విమానాశ్రయ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా మోడీ ప్రభుత్వం మాత్రం దీని ఏర్పాటుపై స్పష్టత ఇవ్వడం లేదు. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాటి భారత పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజును కలిసి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు సహకరించాల్సిందిగా కోరారు. ఫిబ్రవరిలో స్థల తనిఖీ బృందాన్ని పంపనున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆగస్టులో కొత్తగూడెంకు 20కి.మీ దూరం పునుకుడు చెల్కలలో విమానాశ్రయం కోసం 1600 హెక్టార్ల స్థలాన్ని గుర్తించారు. 2016 సెప్టెంబర్‌లో విమానాశ్రయం ప్రాజెక్టు కోసం సైట్ క్లియరెన్స్ సిపార్సు చేశారు. మరో రెండు నెలలకు ఘజియాబాద్ గ్రీనిండియా కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్ 'వన్యప్రాణుల అభయారణ్యంలో సాధారణంగా ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడవని స్పష్టం చేసింది. 2017 మార్చిలో కొత్తగూడెం- పాల్వంచ మధ్య సుమారు 1600 ఎకరాల్లో భూసేకరణపై విమానాశ్రయ అభివృద్ధి ఆధారపడి ఉందని పౌరవిమానయాన సంస్థ తెలపడంతో 2021లో విమానాశ్రయ అధికారులు కొత్తగూడెం- పాల్వంచ మధ్య ప్రతిపాదిత భూమిని సందర్శించారు.
2021లో ఆశలు... అంతలోనే ఆవిరి...
2021మార్చిలో విమానాశ్రయ అధికారులు ప్రతిపాదిత భూమిని సందర్శించడంతో ఆశలు చిగురించాయి. అదే ఏడాది ఆగస్టు నాటికి ఆరు దేశీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసే ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థల మధ్య కీలక సమావేశం జరిగింది. ప్రతిపాదిత విమానాశ్రయాలలో 18 నుంచి 20 సిట్టింగ్ సామర్థ్యంతో మినీ విమానాల నిర్వహణకు అనుమతించాలని కేంద్రాన్ని అభ్యర్థించినా ఫలితం శూన్యమే అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లడం తప్పితే కేంద్రం నుంచి స్పందన కరువైంది. నిబంధనలు అడ్డురాని విధంగా కొత్త స్థలం కోసం జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించింది. 2021 జనవరిలో గుడిపాడు వద్ద అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయాన సౌకర్యం కల్పించేందుకు కేంద్రం ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఉడాన్లోనూ ఉత్తిదే..
ఉడాన్‌లో భాగంగా విమాన సౌకర్యం కల్పించేందుకు దేశవ్యాప్తంగా 948 కొత్త రూట్లను గుర్తించింది. వీటిలో 405 రూట్లలో ఇప్పటికే సర్వీసులు మొదలయ్యాయి. అయినప్పటికీ కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఊసులేకపోవడంతో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశాన్ని 2021లో పార్లమెంట్లో లేవనెత్తారు. దీనిపై కేంద్రం స్పందిస్తూ ఉడాన్‌లో కొత్తగూడెం విమానాశ్రయం లేదని స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాసిన లేఖలోనూ కొత్తగూడెంకు చోటు దక్కకపోవడం గమనార్హం.
కేంద్రం హామీలే తప్ప ఆచరణ లేదు
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దఫదఫాలుగా ఎయిర్‌పోర్టుపై హామీలిస్తూ వస్తోంది. గిరిజన యూనివర్సిటీపైనా ఇలాంటి హామీనే ఇచ్చింది. ఇటు ఎయిర్‌పోర్టు, అటు గిరిజన యూనివర్శిటీల్లో ఏ ఒక్కహామీ నెరవేరలేదు. ఆశలు రేకెత్తించడం.. ఆపై నీరుగార్చడమే కేంద్రం తీరుగా మారింది.
- మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, కొత్తగూడెం