Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరోజుకు చేరిన జనచైతన్య యాత్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య యాత్రకు దారిపోడవునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ఏటూరు నాగారం అడవిలో ఎర్రజెండా రెపరెపలాడింది. బైక్ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. సీపీఐ(ఎం) జన చైతన్య బస్సు యాత్ర ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకుంది. ఉదయం ములుగు జిల్లా పస్రాలో ప్రారంభమైన ఈ యాత్ర వాజేడు, వెంకటాపురం మండలాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం వాజేడు, మధ్యాహ్నం వెంకటాపురం, సాయంత్రం చర్ల మండలాల్లో బహిరంగ సభలను నిర్వహించారు. బస్సుయాత్రలో వందలాది మంది నిర్వహించిన బైక్‌ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. యాత్ర సందర్బంగా విడుదల చేసిన జనచైతన్య పాటలు ఆలోచింపచేస్తున్నాయి. ప్రజానాట్య మండలి కళాకారులు సభ ప్రారంబానికి ముందే వేదిక వద్దకు వెళ్లి ఆటా, పాటలతో అక్కడి ప్రజలను జాగతం చేస్తున్నారు. దేశానికి బీజేపీ ఎంత ప్రమాదకరంగా పరిణమించిందనే విషయాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నారు. మరికొందరు కార్యకర్తలు కరపత్రాలు పంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను వివరిస్తున్నారు. దేశంలో ఆ పార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ... కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ...రాజకీయ లబ్దిపొందుతున్న వైనాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
అదానీ కా అమృత్ మహౌత్సవాలు : పోతినేని
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహౌత్సవాలను నిర్వహిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జనచైతన్య యాత్ర బృంద నాయకులు పోతినేని సుదర్శన్ అన్నారు. కానీ అదానీ, అంబానీకా అమృత్ మహౌత్సవాలు జరిగాయని విమర్శించారు. మోడీ పాలన వారిద్దరికే ఉపయోగపడుతున్నదని చెప్పారు. ప్రజలు, కష్టజీవులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా పాలన ఉందన్నారు. పోరాడే వారిని అణచివేస్తున్నారనీ, ప్రశ్నించే వారిని చంపేస్తున్నారని వివరించారు. వరవరరావు, సాయిబాబాను జైల్లో నిర్బంధించారనీ, గౌరీలంకేష్, కల్బుర్గి చంపడమే అందుకు నిదర్శనమనీ చెప్పారు. పెగాసస్ పేరుతో స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌తో న్యాయమూర్తులు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని విమర్శించారు. ఒకే మతం అంటున్న బీజేపీ ఒకే కులం అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. కులనిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ది చెందుతుందని అంబేద్కర్ చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూసే బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని చెప్పారు. సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు భూములతోపాటు వలస ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అర్హులందరికీ పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) చర్ల మండల కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు పుల్లయ్య, బ్రహ్మచారి, మచ్చా రామారావు, మురళి, సమ్మక్క, తాటి నాగమణి, చర్ల ఉప సర్పంచ్ శివ, వార్డు మెంబర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.