Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో మార్పు తెస్తాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తామనీ, తెలంగాణలో మార్పు తీసుకొస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో దేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలపాలనే సంకల్పంతో పీఎంమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఏడు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు. ఆ పార్కు వద్దనే స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు కార్యాచరణ రూపొందించామనీ, లక్ష మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మంది పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. చేనేత కార్మికులకు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వస్తారనీ, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. త్వరలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలును ప్రారంభిస్తామన్నారు. మేకిన్ ఇండియా కింద డిఫెన్స్ రంగంలో గత ఐదేండ్లలో ఉత్పత్తి 334 శాతం పెరిగిందని తెలిపారు.
కేటీఆరే బాధ్యులు...సిట్టింగ్ జడ్జితో విచారించాల్సిందే : బండి
గ్రూపు-1 ఫలితాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయనీ, టీఎస్పీఎస్సీ బాగోతాలపై సిట్‌తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా గ్రూప్-1 క్వాలిఫై అయ్యారనీ, చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారని తెలిపారు.బీఆర్ఎస్కు చెందిన నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మెన్ కొడుకు, ఓ జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత లేకున్నా క్వాలిఫై చేశారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ సన్నిహిత వ్యక్తి ఒక్కొ క్కరి దగ్గర రూ.3 నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. కేటీఆర్‌ను క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.