Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటీటీలో ప్రసారమవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు కుటుంబ కథా చిత్రాలను అందించిన దగ్గుబాటి రామా నాయుడు కుటుంబ సభ్యుల నుంచి రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ సిరీస్‌లో వెంకటేశ్, రానా నోటి నుంచి అశ్లీల డైలాగులు రావటం కుటుంబ మర్యాదకు భంగం కలిగించేలా ఉన్నదని తెలిపారు. ఓటీటీపై నియంత్రణ, సెన్సార్షీల్ లేకపోవటంతో అశ్లీల సన్నివేశాలు, డైలాగులు విశృంఖలంగా ప్రసారం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యువత పెడదోవ పడుతున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉండటంతో ఓటీటీల ద్వారా వెబ్ సిరీస్ వీక్షించేందుకు సౌలభ్యం కలిగిందని తెలిపారు. దీంతో విష సంస్కృతి కింది వరకు వేగంగా పాకిపోతున్నదని పేర్కొన్నారు.
నష్టపోయిన పంటలకు
పరిహారం చెల్లించాలి : సీఎంకు చాడ లేఖ
రాష్ట్రంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన లేఖ రాశారు. చనిపోయిన పశువులకు, వాటి కాపర్లకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగండ్ల వానతో వరి, మొక్కజొన్న, మామిడి, మిరప, అరటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతుకు పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగటంతో కోలుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా, ఖిల్లా వరంగల్ మండలం, దుపకుంట శివారులోని సర్వేనెంబర్ 284 గల తెజవాత్ కిషన్ అనే రైతు వేసుకున్న మొక్కజొన్న పంటను పరిశీలించాననీ, ఈదురుగాలులతో అది పూర్తిగా నాశనమయ్యిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు, తోటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. మేకలు, గొర్రెలు, బర్రెలు వంటి మూగజీవాలు వడగండ్లకు, పిడుగుపాటుకు మృతి చెందాయని తెలిపారు. పశువుల కాపార్లు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సర్వే చేయించాలని కోరారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పిడుగుపాటుతో మూగజీవాలు, పశువుల కాపర్లు మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.