Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే నిరాహార దీక్ష : సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 22న భువనగిరి జిల్లా తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్ష చేపడతానని ఆయప హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాతల ఆశలను చిదిమేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వానతో అన్నదాత తీవ్రంగా నష్టపోయారన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు కొట్టుమిట్టా డుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే, రైతుల పక్షాన తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయనీ, వరి, మిరప, టమాట, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రైతులకు పరిహారం ఇవ్వండి :మంత్రి నిరంజన్‌రెడ్డికి కాంగ్రెస్ వినతి
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు వి హనుమంతరావు, కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ కోరారు. ఆదివారం ఈమేరకు హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలు ఇతర వివరాలను అంచనా వేసి రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని కోరారు.