Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులు రాజీనామా చేయాలి : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరితండా వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు పంచిపెడుతోందని విమర్శించారు. దేశాన్ని ఏకం చేసేందుకే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని, తక్షణమే టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులు సహా వీరిని నియమించిన వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలు తప్పు చేస్తే దేశంలో రాష్ట్రం తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. డిల్లీ కేజ్రీవాల్ సైతం మోసం చేశారని వివరించారు. లిక్కర్ స్కాంలో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.42వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ అతి పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక చోట్ల మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ సమస్యను తాను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ప్రభుత్వం గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోందని, కనీసం కట్టెలు, మట్టి కోసం కూడా రానీయడం లేదని తెలిపారు. అటవీ సంపద పూర్తిగా గిరిజనులకే చెందుతుందని వివరించారు. వారి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యులు గండ్రత్ సుజాత, నాయకులు చారులత రాథోడ్, వెడ్మ బొజ్జు, భరత్ చౌహన్ పాల్గొన్నారు.