Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవవందనం స్వీకరించిన చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు చేరారు. వీరంతా కారుణ్య నియామకాల ద్వారా నియమితులయ్యారు. 107 మంది పురుషులు కాగా, 57 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి టీఎస్ఎస్పీ అదనపు డీజీపీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో కొండాపూర్ 8వ బెటాలియన్ కమాండెంట్ మురళికష్ణ నెలరోజులపాటు శిక్షణ ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ కొండాపూర్లోని 8వ బెటాలియన్లో ఆదివారం శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్, విశిష్ట అతిథిగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు నిర్వహించిన ఏరోబిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలన్నారు. కర్తవ్యాన్ని విస్మరించొద్దనీ, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్డీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ కొత్తగా వస్తున్న 166 మంది కానిస్టేబుళ్ళలో మూడో వంతు 57 మంది మహిళలు ఉండటం
శుభపరిణామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1,606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. శిక్షణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సజన్ (బెస్ట్ ఆల్ రౌండర్), రమాదేవి (బెస్ట్ ఇండోర్), పూజిత, సాయి కిరణ్(బెస్ట్ ఔట్ డోర్)లకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సీపీఎం కష్ణకాంత్, 8వ బెటాలియన్ కమాండెంట్ మురళికష్ణ, అదనపు కమిషనర్లు గంగారాం, నరేందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.