Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జానపదులను రక్షించుకుందాం
- వక్రీకరణను అడ్డుకుందాం : అందెశ్రీ, విమలక్క
- ఆకట్టుకున్న జానపద కళా ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయాల వల్లనే జానపద కళారూపాలకు చెదలు పట్టాయనీ, వాటిని కాపాడుకోవాల్సిన, వక్రీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని లోకకవి అందెశ్రీ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు విమలక్క పిలుపునిచ్చారు. కళను ఒకరి వద్ద మోకరిల్లేలా చేయొద్దని వారు కోరారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ69 న్యూస్ ఛానల్, టీపీఎస్కే, జానపద వృత్తి కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళామేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ.. ఆటకు, పాటకు ప్రయాణం నేర్పించిందీ జానపదులేనన్నారు. ప్రపంచానికి, దేశానికి దారిచూపిన పాదులు, పునాదులు జానపదకళాకారులేనన్నారు. రాజకీయ నాయకుల దృష్టి జానపదులపై పడిన తర్వాతనే ఆ కళారూపాలకు చెదలు పట్టడం ప్రారంభమైందన్నా రు. జానపదకళలను బతికిస్తున్న వారికి బిచ్చగాళ్లుగా చూసే ధోరణి మారాలని ఆకాంక్షించారు. ఓట్ల కోసం మన ముందుకు వచ్చి చేయిచాస్తున్న రాజకీయ నాయకులే అతిపెద్ద బిచ్చగాళ్లని విమర్శించారు. రవీంద్రభారతి పెద్దోళ్లకు అడ్డా మారిందన్నారు. జానపద, చిన్నచిన్న కళాకారులకు ఆ వేదిక దక్కడం గగనమైపోయిందన్నారు. కళ కళ కోసం కాదు..ప్రజల కోసం అనే నినాదం ఎందుకో నేడు గాడి తప్పిందనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల గడీల్లో పాట బందీ అయిపోయిందని వాపోయారు. ఓట్లు అడుక్కునే వారి పక్షాన తానేప్పుడూ చేరబోననీ, తానెప్పుడూ కళాకారుల వైపే నిలబడతానని ప్రకటించారు. విమలక్క మాట్లాడుతూ.. తెలంగాణలో జానపద కళాకారులకు కొదువలేదన్నారు. ఆ కళను వారే బతికిస్తున్నార న్నారని అభినందించారు. జానపదాన్ని జానపదంగా ఉంచేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడాలని కోరారు. జానపద కళను కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. జానపద కళాకారుల కార్యక్రమాల నిర్వహణకు 'పాడరా పాడరా నవతెలంగాణం అని ప్రతినోటా...' అనే పాటను ఆలపించి కళాకారులను ఉత్తేజపరిచారు. టీపీఎస్కే కార్యదర్శి హిమబిందు మాట్లాడుతూ..జానపద సంపదను ముందు తరాలకు అందించాలని ఆకాంక్షించారు. జానపద కళాకారులకు టీపీఎస్కే ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కళాకారులకు గుర్తింపు కార్డులిచ్చి వారి యోగక్షేమా లను పట్టించుకోవాలని కోరారు. వారికి పెన్షన్ ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కొన్నింటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ..కళారూపం బతకాలంటే ప్రజాదరణ, పాలకుల సహాయం అవసరమని నొక్కి చెప్పారు. జానపద కళల కోసం బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమైపోతున్నాయని వాపోయారు. రవీంద్రభా రతిలో నెలకోసారి జానపదకళారూపాల ప్రదర్శనకు ఉచితంగా అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండూరు భాస్కర్, ఈ69 న్యూస్ ఛానల్ నిర్వాహకులు భానుప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కూరపాటి నాగేశ్వర్రావు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం.శోభన్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న జానపద కళారూపాల ప్రదర్శన
జానపద కళామేళలో పదికిపైగా ప్రదర్శనలను కళాకారులు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయానికి చెందిన అందె భాస్కర్ బృందం పాడిన జానపద పాటలు అలరించాయి. చిన్నచిన్న లోపాలుంటేనే భయపడి అమ్మో అని వెనకడుగు వేసేవారికి యూట్యూబ్ స్టార్ భాగ్య తన ఒంటికాలితో చేసిన నృత్యప్రదర్శన అబ్బురపరించింది. ప్రోత్సాహకరంగా నిలిచింది. లంబాడీ కళాకారులు ప్రదర్శించిన నృత్యం మేళాకు ఊపుతెచ్చింది. బ్యాండ్మేళా కళాకారుల ప్రదర్శనతో మిగతా కళాకారులు చిందులేశారు. జనగాం జిల్లా రంగాపురం కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ జానపద కళారూపం వైభవాన్ని చాటింది. ఇవే కాకుండా యక్షగానం, డప్పుల ప్రదర్శన, చిరుతల భజన, తదితర జానపద రూపాలను కళాకారులు ప్రదర్శించారు. వారిని నిర్వాహకులు మెమెంటోలు, జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సత్కరించారు.