Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం..
- యువత ప్రాణాలను కాపాడుకుందాం : డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2కె రన్ జెండా ఊపి ప్రారంభించిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ స్వాతంత్య్రం కోసం అతిచిన్న వయస్సులో ప్రాణాలర్పించిన వీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తితో విద్యార్థి, యువత ముందుకెళ్లాలని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్ అన్నారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల అధ్వర్యంలో నిర్వహించనున్న భగత్‌సింగ్ స్మారక యువజనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో 'డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, యువతను కాపాడుకుందాం' అంటూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు 2కే రన్ నిర్వహించారు. సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్ ఈ 2కే రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత, విద్యార్థి డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించడంతో ఆనారోగ్యం బారిన పడుతున్నారని, చెడు వ్యసనాలకు బానిసలవుతారన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేసేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కోరారు. భగత్‌సింగ్ ఆలోచనలు, ఆశయాల స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రోద్యమ వీరుల చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. నేడు సమాజంలో సామ్రాజ్యవాద దోపిడి మరో కోణంలో జరుగుతుందని, విద్యా, వైద్యం వంటి అంశాలు పేదలకు అందని ద్రాక్షలా మారుతున్నాయన్నారు. మతోన్మాదం పెచ్చరిల్లుతూ భారత చారిత్రక లౌకిక వారసత్వాన్ని దెబ్బతీస్తున్నదని తెలిపారు. అంటరానితనం, అసమానతలు తీవ్రమవుతున్నా యని, మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని ఈ తరుణంలో వీటన్నింటిపై ఉద్యమించడమే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భగత్‌సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయికి బానిసై విద్యార్థి, యువత చెడు వ్యసనాలబారిన పడుతున్నారని, వాటిని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా పెట్టి యువత ప్రాణాలను కాపాడాలని కోరారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా, డ్రగ్స్ నిర్మూలన, అవినీతి అంతం కోసం, రాజ్యాంగ పరిరక్షణకు విద్యార్థి, యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భగత్ సింగ్ వర్దంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండీ.జావెద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, నాయకులు రవినాయక్, శ్రీను, నాగేందర్, శ్రీమన్ స్టాలిన్, డీవైఎఫ్ఐ నాయకులు రవి, హస్మిబాబు, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు పార్థసారథి, శ్రీనివాసరావు, ఎం.మహేందర్, జేకే శ్రీనివాస్, దశరథ్, టి.మహేందర్, కుమార్, విజయ్ కుమార్, పాషా, కిరణ్, వాణి, నర్సింగరావు పాల్గొన్నారు.