Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికి సంపూర్ణ ఆరోగ్యమే.. ప్రభుత్వ సంకల్పం
- ప్రజల ముంగిటకే ప్రాధమిక వైద్యం....80.67 లక్షల మందికి కంటి పరీక్షలు
- 13.70 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
- ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ఆరోగ్య సేవలు,
- 8 విభాగాల్లో పరీక్షల నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'కంటి వెలుగు' కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 80,67,243 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 13,70,296 మందికి ఉచితంగా కండ్లద్దాలు, ఔషధాలు అందజేశారు. ప్రభుత్వ వైద్యంతో తమకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. జనవరి 18నుంచి జూన్ 15 వరకు 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారీ సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ ఆ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
హ్రస్వ దృష్టి లోపాలు
అన్ని జిల్లాలో దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్టు శిబిరాల్లో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏండ్ల వయస్సు పైబడిన వారిలో చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదు. ఇలాంటి వారికి తక్షణమే వైద్యులు రీడింగ్ గ్లాసెస్‌ను అందజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏండ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు (కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
మహిళా ఆరోగ్య కేంద్రాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా ఎనిమిది విభాగాల్లో వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. 'మహిళ ఆరోగ్యం - ఇంటికి సౌభాగ్యం' అనే లక్ష్యంతో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించింది. ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక డయాగస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, పి.ఐ.డి., పిసిఓఎస్., కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు పరీక్షిస్తున్నారు. మహిళల్లో ఉన్న పోషకాహార లోపం నివారణ కోసం క్లినిక్‌లో అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తున్నారు. మహిళా క్లినిక్లల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి ప్రాధమిక పరీక్షలు చేసి వ్యాధి నిర్దారణ జరిగితే రిఫర్ చేసి చికిత్స అందేలా చూస్తున్నారు. మహిళా క్లినిక్ కు వచ్చే పేషెంట్ల వివరాలను ప్రత్యేక యాప్‌లో పకడ్బందీగా నమోదు చేస్తున్నారు. ఆరోగ్య మహిళల నుంచి వచ్చే కేసుల కోసం రిఫరల్ ఆస్పత్రులలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.