Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతు సంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ తెలంగాణ రైతు సంఘం కోరింది. మంగళవారం ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్...సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో రూ.1250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే ప్రాథóమిక అంచనా వేసిందని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ నెల 16 నుంచి 20 వరకు కురిసిన వర్షాల వలన 25 జిల్లాలలో దాదాపు 7 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరి, మొక్కజొన్న, పసుపు, మిరప, జొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు, కూరగాయల పంటలు పూర్తిగా నష్టపోయాయని పేర్కొన్నారు. పండ్ల తోటలలో పుచ్చ, కర్బూజ, మామిడి పంటలు దెబ్బతింటే, పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు, ఎద్దులు మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం మండలంలో ధరంసోత్ శంకర్ మరణించారని తెలిపారు. పెనుబల్లి మండలం బయ్యన్నపురంలో పిడుగుపడి 1500 కోళ్ళు మృత్యువాతపడ్డాయని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా ఆళ్ళపల్లి మండలంలో పిడుగుపడి మూడు గ్రామాల్లో 13 దుక్కిటెడ్లు మరణించాయని గుర్తు చేశారు. మొత్తంగా రూ. 2,000 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఎండిఆర్ఎఫ్ స్కీమ్ కింద పరిహారం ఇప్పిస్తామంటూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. భారీ నష్టం జరిగినప్పటికీ 43,424 మందికి చెందిన 57,855 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు ప్రకటించడం సరైందికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 2023 మార్చి 14న రూ.1816 కోట్లు విడుదల చేసిందనీ, అందులో రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2022-23లో వానాకాలం, యాసంగి కలిసి రూ.4,000 కోట్లు రైతులకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఎకరా ఆహారధాన్యాలకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.40వేల పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.