Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మా కంపెనీల దోపిడీని అరికట్టాలి
- ఎస్వీకే ఇన్చార్జి ఎస్.వినయకుమార్
నవతెలంగాణ - భువనగిరి
మార్కెట్లో ఫార్మా కంపెనీల దోపిడీ విచ్చలవిడిగా పెరిగిందని, జనరిక్ మందుల వాడకంపై ప్రభుత్వం ప్రచారం చేపట్టాలని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్చార్జి ఎస్.వినయకుమార్ అన్నారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జనరిక్ మెడిసిన్‌పై ట్రస్ట్ అధ్యక్షులు గూడూరు అంజిరెడ్డి అధ్యక్షతన అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వినయకుమార్ మాట్లాడారు. ఫార్మా కంపెనీలు మందుల వ్యాపారం పేరుతో యథేచ్ఛగా దోపిడీ కొనసాగిస్తున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఫార్మా కంపెనీలకు స్వేచ్ఛనివ్వడంతో విచ్చలవిడి ధరలతో ఒక మాఫియా లాగా మందుల అమ్మకం జరుగుతోందన్నారు. జనరిక్ మందులు కూడా ఇతర మందుల్లాగే పనిచేస్తున్నాయని, వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటిని ప్రచారంలో పెట్టడంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫార్మా కంపెనీల దోపిడీిని అరికట్టి జనరిక్ మందుల ప్రచారాన్ని.. వాటి ప్రత్యేకతలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎండి.జహంగీర్, ట్రస్టు సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సంగు నరేందర్, గద్దె నర్సింహ, ఎదునూరి మల్లేశం, దయ్యాల నర్సింహ, ఎంఎ.ఇక్బాల్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.