Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన చైతన్య యాత్ర విజయవంతం కోసం..
- ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో శిక్షణ
నవతెలంగాణ-కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించేందుకు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్టు పీఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహులు తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాన్ని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ప్రారంభించారు. జెండాను పీఎన్ఎం జిల్లా కార్యదర్శి సిర్పలింగం ఆవిష్కరించారు. ఈసందర్భంగా కట్టా నరసింహులు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్ర శిక్షణా శిబిరానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నదని అన్నారు. శిక్షణా శిబిరం ముఖ్య ఉద్దేశం మోడీ ప్రభుత్వం విధి విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) చేపడుతున్న జన చైతన్య యాత్రను విజయవంతం చేయడం కోసం ఆటమాట పాటతో ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, ధరలు మిన్నంటాయని, పాటలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ధ్యేయం అని అన్నారు. ఈ జన చైతన్య యాత్ర ఈనెల 24 నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం కానుందని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, ఉపాధ్యక్షులు వినోద్, ప్రభాకర్, నాయకులు లావణ్య, శ్రావణి, అనిల్ తదితర కళా బృందం పాల్గొన్నారు.