Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన మామిడి దిగుబడి.. కౌలు రైతుల్లో దిగులు
- సాగులో నష్టపోతున్న రైతులు
- ఆర్థిక సహాయం అందక రైతన్న విలవిల
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మామిడి చెట్లను ఈసారి వైరస్ కప్పేసింది. పూత, పింద లేక చెట్లు వడలిపోయాయి. ఉన్న కాయలకూ తెగులే కనిపిస్తోంది. ఈ సాగులో ఉన్న కౌలు రైతన్న కూనరిల్లుతున్నాడు. పత్తి మొదలుకొని వేరుశనగ, కందుల దాకా కౌలు రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగులో ఎకరాకు 150,000 చెల్లిస్తుంటే మిగతా పంటలకు 20 వేలు కౌలు చెల్లిస్తున్నారు. కొల్లాపూర్ బెనిశాన్ దేశంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ ఎడాది మామిడి సాగుకు వైరస్ ప్రభావంతోపాటు అతి ఉష్ణోగ్రతల వల్ల పూత కాత లేదు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా మామిడి తోటలు కొల్లాపూర్, కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి, మండల పరిధిలో అధికంగా ఉన్నాయి. 20వేల మంది కౌలు రైతులున్నారు. వీరి మామిడితోపాటు బత్తాయి, జామ పంటలు సైతం సాగు చేశారు. అత్యధికంగా వీపనగండ్ల మండల పరిధిలో మామిడి తోటలు ఉన్నాయి. చలికాలం ప్రారంభ దశలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం వల్ల మామిడి పూతపై భారీ దెబ్బ తగిలింది. వచ్చిన పూత వైరస్ ప్రభావం చేత నేలరాలింది. ఆకులు సైతం నల్లగా మారిపోతు న్నాయి. వీపనగండ్ల మండల పరిధిలో మాసం వెంకటయ్యకు ఆరు ఎకరాల్లో బేనిషాన్ మామిడి తోట. గత ఏడాది బాగా దిగుబడి వచ్చింది. ఈసారి దిగుబడి 90 శాతం తగ్గింది. మరో రైతు మాసయ్య మామిడి తోటదీ ఇదే పరిస్థితి. గత ఏడాది ఐదు లక్షలు వచ్చాయని, ఈసారి ఐదు వేలు అయినా వచ్చే అవకాశాలు లేవని రైతులు తెలిపారు. కల్వకోలు లక్ష్మయ్యకు మామిడి తోట ఉంది. సీజన్లో పూత రాలిపోయింది. కాతా నిలువలేదు. ఇప్పుడు ఆకు సైతం నల్లగా మారిపోతుందన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 70 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో 55 వేల ఎకరాలు దిగుబడి ఇస్తుండగా.. మరో 25 వేల ఎకరాలు కాత దశలో ఉన్నాయి. మామిడి తోటలను 20 వేల కుటుంబాలు కౌలు తీసుకొని జీవిస్తున్నాయి. ఎకరాకు లక్షన్నరకు పైగా కౌలు చెల్లించారు. ఇప్పుడు కౌలు తీరే దారి లేక అప్పులు చెల్లించలేక రోడ్డున పడ్డారు. మిగతా పంటల మాదిరిగా కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మామి డి సాగులో నష్టపోయిన కౌలు రైతులకు ఆర్థిక సహా యం అందించాలని ప్రజాసంఘాల నేతలు కోరారు.
కౌలు రైతులను ఆదుకోవాలి
ఈసారి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మామిడి పూత రాలి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టగా.. కౌలు రైతులకు ఈ ఏడాది 5 వేలు రావడం లేదు. మిగతా పంటల మాదిరిగా కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి అంచనాలు తయారు చేసి పరిహారం అందించాలి.
- బాల్ రెడ్డి- రైతు సంఘం
నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు