Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాదనే అధికారం కేంద్రానికి లేదు : టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాత పెన్షన్ విధానం సాధన కోరుతూ జరిగే నిరసన ప్రదర్శనల్లో ఉద్యోగులు పాల్గొంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరించటాన్ని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తీవ్రంగా ఖండించారు. సమస్యలపై నిరసన తెలపడం ఉద్యోగులు పోరాటం చేయడం ప్రజాస్వామిక హక్కని అన్నారు. దీన్ని కాదనే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి 22వ వర్ధంతి సభ మంగళవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా విభాగం ఆదేశాలివ్వడం పైగా ఈ ఆదేశాలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కో వాల్సి ఉంటుందని హెచ్చరించటం అప్రజాస్వామికమని విమర్శించారు. ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం బెదిరిపులకు భయపడకుండా పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి తలొగ్గి ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని గుర్తు చేశారు. పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. తొలుత వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమం కోసం 16 ఏండ్ల సర్వీసును వదులుకుని పూర్తి కాలం కార్యకర్తగా మారి ఆయన చేసిన త్యాగం అందరికీ స్పూర్తిదాయకమని ఇతర నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ సింహాచలం, రాష్ట్ర కమిటీ సభ్యులు శారద, రాజారావు, శ్యామ్ సుందర్, సైదులు, నరసింహారెడ్డి, జిల్లా నాయకులు విద్య, జగన్మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.