Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం :రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-చొప్పదండి
రెండు, మూడ్రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పలి వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మండలం మంగళపల్లె, రామడుగు మండలం వెంకట్రావుపల్లి, రామచంద్రపూర్, దత్తోజిపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, కర్బూజ, ఇతర పంటలను కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వడగండ్ల వాన పడటంతో పెద్దఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. దాదాపు 21 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా చర్యలు వేగవంతం చేస్తునట్టు చెప్పారు. పంట నష్టం నివేదికను తక్షణమే సిద్ధం చేసి అందజేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించామన్నారు. నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రతి రైతునూ ఆదుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా కల్పించారు. వారి వెంట జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో స్వరూప, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మెన్ వెల్మ మల్లారెడ్డి, సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.