Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి
- టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులు రాజీనామా చేయాలి
- హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేయించాలి
- ఇక నుంచి ఐక్య పోరాటాలు
- విద్యార్థి జన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యమే కారణమని పలువురు నాయకులు విమర్శించారు. విద్యార్థి జన సమితి (వీజేఎస్), యువజన సమితి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై అనే అంశంపైనిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులందరికీ తిరిగి పరీక్షలు నిర్వహించేంత వరకు పరిహారం చెల్లించాలని సమావేశం డిమాండ్ చేసింది. టీఎస్ పీఎస్సీ చైర్మెన్ అధీనంలోనే పరీక్షల వ్యవస్థ ఉన్న నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆయనతో సహా సభ్యులందరూ రాజీనామా చేయాలని తీర్మానించింది. మొత్తం అధికారం సీఎం చేతిలోనే ఉంది. అందువల్ల ఆయన ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని అభిప్రాయపడింది. త్వరలో అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించింది.
సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో ఐక్య ఉద్యమం కొనసాగాలని సూచించారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదనీ, యువతలో నిర్లిప్తత మంచిది కాదని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్, దేశానికి తెలంగాణ మోడల్ అని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేందుకు బలమైన ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ఇద్దరు మాత్రమే తప్పు చేశారని చెప్పడం ...సిట్ అధికారులను హెచ్చరించినట్టుగా ఉందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై బయటికొచ్చాక సకాలంలో సాక్ష్యాలను సరిగ్గా సేకరించలేదని తప్పుపట్టారు. సిట్‌కు విచారించే సాంకేతిక సామర్థ్యం లేదనీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ అన్ని రకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. రాజకీయ ప్రమేయం లేని వారిని టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం నిర్వహించాలనీ, వాటిలో కాంగ్రెస్ భాగస్వామి అవుతుందని తెలిపారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగన్న మాట్లాడుతూ టీఎస్పీయస్సీ సభ్యునిగా ఉన్న సమయంలో విఠల్ అన్ని ఉద్యోగాలు భర్తీ చేశామంటూ చెప్పారని గుర్తుచేశారు. ఆయన బీజేపీలో చేరాక ఉద్యోగాల భర్తీ చేయలేదంటూ మాటమార్చారని విమర్శించారు. సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గోవర్థన్ మాట్లాడుతూ, పరీక్షలు తిరిగి నిర్వహించేంత వరకు ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజాపంథా నాయకులు వి.ప్రవీణ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జాన్సీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పుట్టా లక్ష్మణ్, సీడీపీఓల అభ్యర్థుల ప్రతినిధి స్వప్న, స్వేరోస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, టీపీటీఎఫ్ నాయకులు కొండల్ రెడ్డి, హెసీయూ విద్యార్థి నాయకులు వెంకటేష్ చౌహాన్, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.