Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాట సంఘంలోకే బీడీ కార్మికులు, టేకేదార్లు
- బీడీ రంగంపై ఆంక్షలు ఎత్తేయాలి
- చట్టబద్ధ సౌకర్యాల కోసం పోరు : ఎస్ రమ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా దొమకొండ, బీబీపేట్ మండలాల నుంచి సుమారు 2400 మంది బీడీ కార్మికులు సీఐటీయూలో చేరారు. పోరాట సంఘంలోనే భాగస్వామ్యం అవుతామంటూ వివిధ సంఘాలకు రాజీనామా చేసి సీఐటీయూ జెండా పట్టారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దొమకొండలోని పైడిమర్రి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నుంచి కార్మికులు సీఐటీయూలో చేరారు. వారిని బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పోరాటాలకు సీఐటీయూ కేరాఫ్‌గా నిలిచిందన్నారు. కార్మికుల చట్టబద్ధ సౌకర్యాల సాధనకు కామారెడ్డి జిల్లాలో భవిష్యత్తు ఉద్యమాలు చేపడతామని, జిల్లాను పోరాట కేంద్రంగా మలుస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ రంగంపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ మహిళల ఉపాధి దెబ్బతిస్తున్నాయని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ రంగంపై లక్షన్నరకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వివరించారు. కార్మికులకు 24 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే టేకేదార్లు, చాట, ప్యాకర్లు, బీడీ కార్మికుల్లో అర్హులైన అందరికీ జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని అన్నారు. బీడీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌లో జరుగుతున్న అవకతవకలను సవరించాలన్నారు. కార్మికులకు రావాల్సిన చట్టబద్ధ సౌకర్యాలన్నీ కల్పించాలని, లేకపోతే కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగారపు ఎల్లయ్య, బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌తో పాటు దశరథం, శంకర్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, శివాజీ, లక్ష్మీనారాయణ, రవి, నరహరి, చందు, శ్రీనివాస్, నర్సింలు రాజ్యలక్ష్మయ్య, మహాదేవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.