Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రేస్ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలి
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల ఎకరాల్లో పంట నష్టం:పంటనష్టపరిహారం చెక్కుల పంపిణీలో మంత్రి ఎర్రబెల్లి
- రాష్ట్రంలో మొదటిసారిగా పంటనష్టపరిహారం చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-నర్సంపేట
పంట నష్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయడం లేదని, రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ఘనుడని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 2022 పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ ప్రక్రియను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం నర్సంపేట నియోజకవర్గం నుంచే ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న రైతులకు భరోసానివ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, దాన్ని అంచనాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించినా.. ఇప్పటివరకు నయా పైసా సహాయం చేసిందిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాదీ వడగండ్ల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టాన్ని చవిచూశారని ఆందోళన వ్యక్తం చేశారు. 1,11,235 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారని తెలిపారు. దాదాపు 71వేల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో అధికంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇంతటి నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. నష్ట పరిహారంపై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని, సమీప ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని గుర్తించాలన్నారు. ముందుగా అక్కడ పరిహారం చెల్లించి మాట్లాడాలని హితవు పలికారు. గతేడాది జరిగిన నష్టంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి జిల్లాలో రూ.13.86 కోట్ల నష్టపరిహారం విడుదలైందని, 15 రోజుల్లోపు 17 వేల మంది రైతులకు చెక్కులను అందజేయనున్నారని తెలిపారు.
వరి, మిర్చి, పత్తి పంటలపై హెక్టార్‌కు రూ.13,500, మొక్కజొన్నకు రూ.8,333 పరిహారం అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అడిగిన వెంటనే నర్సంపేటకు రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్లు మంజూరు చేశామ న్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జెడ్పీ వైఎస్ చైర్మెన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మెన్ గుగులోత్ రామస్వామి నాయక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాల్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఏడీఏ అవినాష్ వర్మ, ఉద్యానవన డివిజన్ అధికారి జ్యోతి, ఎంపీపీ, జెడ్పీటీసీ, పీఏసీఎస్ చైరెన్లు, తదితరులు పాల్గొన్నారు.