Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరొకరి పరిస్థితి విషమం
- భద్రాద్రి జిల్లా లక్ష్మీపురంలో ఘటన
నవతెలంగాణ - బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఓ ప్రయివేటు కర్మాగారంలో ఇరువురు వలస కూలీలు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీపురం గ్రామంలోని కోడిగుడ్డు ట్రే తయారీ ఫ్యాక్టరీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు పనులు చేస్తున్నారు. బుధవారం కర్మాగారంలోని ముడిసరుకు నిల్వ ఉంచే బావిని శుభ్రం చేస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో వారికి ఊపిరి అందక అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్ వివరాలు సేకరిస్తున్నారు.