Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ''ఆరోగ్య మహిళ'' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రెండు మంగళవారాల్లో కలిపి 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మొదటి మంగళవారం (ఈనెల 14న) 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 975 మందికి అవసరమైన మందులను అందజేశారు. ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని గుర్తించి సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తుండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో మంగళ వారం (ఈనెల 21న) 6,328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్‌ను సందర్శించారు. వీరిలో 3,753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 718 మందికి మూత్రకోశ ఇన్ఫెక్షన్ల నిర్ధారణ పరీక్షలు, 1,029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్-డి లోప పరీక్షలు, 1294 మందికి సీబీపీ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే 8 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, 2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య మహిళా కార్యక్రమన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.