Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
- ఉగాది వేడుకల్లో బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా నిర్వహిస్తామనీ, త్వరలో మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. మంగళంపల్లి శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం వినిపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, మహిళా మోర్చా అధ్యక్షులు గీతామూర్తి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బండి సంజరు మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా పోరాడుతామన్నారు. పరీక్షల రద్దు నేపథ్యంలో నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగల జీవితాలపై ప్రభావం చూపే పేపర్ లీకేజీ సర్వసాధారణమా? అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలకు కారకుడైన మంత్రి కేటీఆర్ రాజీనామా చేసేదాకా వదిలిపెట్టబోమన్నారు. ఆయనకు సిట్ ఎందుకు నోటీసులివ్వలేదో చెప్పాలని నిలదీశారు. ప్రశ్నించే మీడియా సంస్థలను, పార్టీల అమతు చూస్తామని వార్నింగ్ ఇవ్వడంలో భాగంగానే తీన్మార్ మల్లన్న, విఠల్ అరెస్టులు జరిగాయన్నారు. ఈ అంశంపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా రోడ్లెక్కి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. అనంతరం బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా సంస్థలను, యూ ట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్టు చేయడం వంటి అంశాలను ఖండించారు. జర్నలిస్టుల పక్షాన న్యాయపోరాటం చేస్తామన్నారు.